ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

185

వేయుట కేమున్నది? మన మేమి యకార్యకరణము చేసినామని గణపతి పక్షమువారు రెండవ పక్షమువారి నడిగిరి. పాత పద్ధతులు విడిచి క్రొత్తపద్ధతు లవలంబించుటే తప్పు. శ్రాద్ధమున కోటుగుడ్డ లేమిటి? ఎవరయిన విన్నపక్షమున మొగము మీద నుమ్మి వేయుదురు రని వారు బదులు చెప్పిరి. మొగముమీఁద నుమ్మివేయుదు రన్నమాట గణపతికి, గణపతి పక్షము వారికి మహాగ్రహము కలిగించెను. తీవ్రములైన మాటలతో వారు కొంతసేపు యుద్ధము చేసిరి. ఆ మాటలు క్రమక్రముగ ముదిరెను. చేతులు కలసెను. కొందరు చేతులతో చెట్లకొమ్మలు బెడ్డలు పుచ్చుకొని కొట్టుకొనిరి. కొందరు జుట్టుపట్టుకొని నేలఁబడిరి. ఏడ్చువారు కొందరు, తిట్టువారు కొందరు, పాఱిపోవు వారు కొందరు మన గణపతికి కడపటి గుణములోఁ జేరెను. బెడ్డల దెబ్బలు తగిలి కొందరికి నెత్తురులు కారెను. అది నీళ్ళ రేవగుటచే నచటకు వచ్చిన స్త్రీలు స్నానము చేయవచ్చిన పురుషులు చుట్టుముట్టి వివాదకారణ మేమని యరసి, శ్రాద్ధములలో సైనుగుడ్డలకు మారు కోటు గుడ్డలు భోక్తలు పుచ్చుకోవలసిన దను విషయమును గూర్చి వివాదము పొడమి తుద కీ విధముగఁ బరిణమించిన దని విని, కడుపు చెక్కలగునట్లు నవ్విరి. భోక్తలుగా వచ్చినవా రిరువదిమంది. అందు బదునలువురు గణపతిపక్షమై యుండిరి. గణపతి పారిపోయి మరి యెక రేవున స్నానముచేసి తనపక్ష మున్నవారి కందఱకు వర్తమాన మంపి వారి కిట్లనియె.