ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

183

నందు మనంబు నిల్చునట్లు తదేక ధ్యానపరాయణుఁడై యుండెను. అంతలో సమీపగ్రామమున నొక బ్రాహ్మణుని తండ్రి మృతి నొందగా పదుకొండవ దినమునను బండ్రెండవ దినమునను గణపతి మిత్రులతో శ్రాద్ధభోక్తగా నియమింపఁబడెను. ఈ కాలమునందువలెఁ గాక యా కాలమున గావలసినంతమంది శ్రాద్ధభోక్తలు దొరకుచుండెడివారు. ఒకప్పుడు గావలసినవారికంటె నెక్కున సంఖ్య లభించుటయుఁ గలదు. వారి కీయవలసిన దక్షిణ కూడ నిప్పటివలె నధికము కాక నాలుగణాలకు మించకుండెను. గణపతి తన మిత్రబృందముతో నచ్చటి కరిగి తన చెలిమికాండ్రను దనకు బరిచితులు గాని యితర గ్రామవాసు లగు భోక్తలను బిలిచి, స్నానపు నెపమున జెరువుగట్టునకుఁ దీసికొనిపోయి, రావిచెట్టు క్రిందఁ గూర్చుండబెట్టి పొగచుట్టలు గాల్చు నభ్యాసముగలవారి కందరకుఁ దలకొక చుట్ట నిచ్చి, తానొక చుట్ట వెలిగించి కాల్చుచు నీ క్రింది విధమున మాట్లాడెను.

"మీకందరకు నేనొక సలహా చెప్పదలఁచుకొన్నాను. అది మన కందరకు మిక్కిలి ఉపయోగకరమయినది. షోడశ బ్రాహ్మణార్థములు మన మందరము చేయుచున్నముకదా! కాబట్టి మన యవసరము బ్ర్రాహ్మణుల కందరకున్నది. భోక్తలుగా మనము కూర్చున్నందుకు మనకు వారు నాలుగణాలు రొక్కమో లేక యొక సైనుగుడ్డయో యిచ్చుచున్నారు. ఆ గుడ్డలు చిరకాలము మన్నవు. అవి ప్రేతకళ క్రక్కుచుండును.