ఈ పుట అచ్చుదిద్దబడ్డది

182

గ ణ ప తి

కన్నులలో నిప్పులు పోసికొనును. నీవు పచ్చగా నుండుట యామె కెంతమాత్ర మిష్టములేదు. నీవు గిరజాలు దువ్వుకొని కోటు దొడిగికొని యల్లారుముద్దుగా నుండుట దాని కిష్టములేదు. అది చూచుచుండగా బిందె తీసికొనుటకు వీలులేదు. బిందె చిల్లి పడినందున నీళ్ళుపోసుకొనుటకు వీలులేక సున్నిపిండి కుంకుడు కాయలు పోసుకొనుచున్నారు. అది నేను తీసికొంటినా నీ మామతోఁ జెప్పి తిట్టించును. ఆవిడ నాలుగు దినములలో పురిటినిమిత్తము పుట్టింటికి వెళ్లును. మీ మామ పొలము వెళ్లుచుండును. అప్పుడు మనకు స్వేచ్ఛగా నుండును. గనుక బిందె నేనే తాకట్టుబెట్టి సొమ్ము తెచ్చి యిచ్చెదను. అంత వఱకు నోపికపట్టుము. అనవుడు గణపతి కోపించి పండ్లుకొఱికి "బోడి పెత్తనములు వెధవ పెత్తనములు మన బిందె మనము తీసికొనుటకు వీలులేక వచ్చినది. ఈ కోట్లు కుట్టించుకొన్న తరువాత మన మొకరియండ నుండకుండ హాయిగా స్వేచ్ఛగ నుండవచ్చును. సరే! నీయిష్టము వచ్చిన ట్లామె పుట్టింటికి వెళ్ళిన తరువాత చేయవచ్చు" నని పండుకొనెను. నాఁడు మొదలుకొని గణపతి యెప్పుడు మేనమామభార్య పుట్టింటికి వెళ్ళు, నెప్పుడు బిందె కుదువఁబెట్టి తల్లి రూకలు తెచ్చి తనచేతఁ బడవేయు, నెప్పుడు కోట్లు తాను కుట్టించుకొనుట కనువుపడు నని నడుచు నప్పుడును స్నానము చేయునప్పుడు భోజనము సేయునప్పుడును జిత్తంబు దానియందె నిలిపి, కాముకుండు తన ప్రియురాలి యం దనురాగము నిలుపునట్లు, భక్తుడు తన యిష్టదైవము