ఈ పుట అచ్చుదిద్దబడ్డది

180

గ ణ ప తి

కాలము మారిపోయినది. గౌరవమునకు కావలసిన నాలుగు వస్తువులలో నేను మూడు సంపాదించుకొన్నాను. అవేవనగా గిరజాలు, ముచ్చెలు, చేతికఱ్ఱ. నాలుగవది కోటు అవి రెండుండుట మంచిది. అధమపక్ష మొకటియైన గుట్టించి తీరవలెను. మామయ్య చూడకుండ మన బిందె యీవల పడవేసినా నా గౌరవము కాపాడినదాన వగుదువు. తల్లంటె నీవే తల్లివి, ఈ యుపకారము చేసితివా వేయిజన్మలకైన నీ కడుపుననే పుట్టవలె నని కోరుదును. ఇప్పుడు మనకు బిందె యెందుకు? మామయ్యగారు వాడుకొనుచున్నారు. మన కవసర మున్నప్పుడు వారెందుకు వాడుకోవలెను? రెండు కోట్లు కుట్టించుకొని, నేను తగు మనుష్యుడనైన తరువాత కావలసినన్ని బిందెలు సంపాదింపఁగలను. బిందెలే కావు గంగాళములు, గాబులు సంపాదింపఁ గలను. గౌరవము కోటులో నున్నది. దేవుఁడు కోటుజేబులో కూర్చుండును. ఆడుదానవు, అందులో మాయామర్మ మెరుగని దానవు కనుక నీకు తెలియదు, కోటు సంగతి. మగవాడను, చదువు కొన్నవాఁడను, ప్రయోజకుడను గనుక నాకు తెలుసు దాని సంగతి. ఈ పట్టున కోటు పురాణము వ్రాయమంటె కావలసినంత గ్రంథము వ్రాయగలను." అంతరాయములేని ధోరణితో గణపతి యుపన్యాసము చేయుచుండ నల్లమందు పట్టిచ్చుటచే నామెకు కునికిపాటు వచ్చెను. అందుచే నామె జోగి జోగి మంచము మీఁదనుండి క్రిందబడెను."ఓసీ! నీవెర్రి తగులబెట్ట! కునికిపాట్లు పడుతున్నావటె? పూట పూటకు కుంకుడు కాయంత నల్లమందు వుండలు మ్రింగి చెడిపోయినావు, సరే;