ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

179

కుట్టించినతరువాత నాదర్జా యేమిటో మాకందఱకు తెలియఁగలదు. మానాయన సంపాదించిన బింది యేదైన నున్న పక్షమున నాకియ్యి. అమ్మియో, తాకట్టు పెట్టియో రెండు కోటులు కుట్టించుకుందును. కోటు లేనివారి కీ కలియుగములో గౌరవమే లేదు. కొంప లేకపోయినను భయము లేదు. భూములు లేక పోయినను విచారము లేదు. ఉద్యోగము లేకపోయినను కొరతలేదు. కాని కోటు లేకపోతే యావత్తు వెలితియే! కోటు లేని వాఁడు చిల్లిగవ్వ చేయఁడు. రాజమహేంద్రవరములో నున్న మగవాళ్ళందఱు కోట్లు వేసికొన బట్టియే మిక్కిలి గౌరవము పొందుచున్నారు. రెండు కోట్లున్న పక్షమున నేనీ గ్రామములో శిఖామణినై యుండెదను. అప్పుడు నేను తగవులు దిద్దఁగల పెద్దమనిషినై యుందును. అప్పుడు అందఱు నా దర్శనమే చేయుదురు. నన్నే యాశ్రయింతురు. నన్నే పిలుతురు. నాకే దండములు పెట్టుదురు. పూర్వకాలములో జడలు ఉంచుకొన్న మునీశ్వరులకే గౌరవము. ఈ కాలములో గిరజాలు పెంచుకొన్న పడుచు వాండ్రకే గౌరవము. పూర్వకాలములో మంచి కాషాయి వస్త్రాలు కట్టుకొన్నవాళ్ళే పూజ్యులు. ఇప్పుడు కోట్లు తొడిగికొన్న వాళ్ళే పూజ్యులు. పూర్వకాలములో దండము చేతిలో దాల్చినవారికి మర్యాద. ఇప్పుడు బెత్తము చేతితో బట్టుకొన్న వారికి మర్యాద. పూర్వము పావుకోళ్ళుఁ దొడిగినవాళ్ళది గొప్ప. ఇప్పుడు ముచ్చెలు, చెడావులు దొడిగికొన్న వాళ్ళది గొప్ప.