ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

171

భావించెను. కొంచెముసే పిట్టట్టు బచారుచేసి తనపాద మందులోబెట్టి సరిపోవునేమో యని చూచెను. అది సరిగా నతనికి సరిపోయెను. అటువంటిది, మఱియొకటి దొరకనప్పు డిదియె తాను గ్రహింపఁదగునని నిశ్చయించి యటుచూచి చేయిజూచి జోడు తీసి యుత్తరీయమున జుట్టి దొడ్డిదారిని బోయి తన బట్టల మూటలో బెట్టెను. ఆ కోమటియు గుమారుఁడు దాంబూలము పుచ్చుకొని వీథిగుమ్మముకడకుఁ బోయి చూచునప్పటికి జోడు కనఁబడలేదు. జరీపనిచేసిన ముచ్చెలజోడు కావలయునని కొడుకెంతో ముచ్చట పడగా కోమటి యాకాలమున నట్టిజోళ్ళకుఁ బ్రసిద్ధికెక్కిన పెద్దాపురమునం దది పురమాయించి చేయించి తెప్పించెను. ఆ పూటే కొడుకది తొడిగికొనివచ్చెను. కుఱ్ఱవాఁ డేడుపు మొగముపెట్టి యింటికిఁ బోయెను. విడిదిలో జోడు బోయినదని పెండ్లికుమారుని తండ్రి యెంతో నొచ్చుకుని కూడ వచ్చిన వారినందఱనడిగెను. కాని యది బయలుపడలేదు. అక్కడున్న వారందఱు దొంగిలించిన వానిని నోటికి వచ్చినట్లు తిట్టిరి. వారితోపాటు గణపతియు నాలుగు తిట్లు తిట్టెను. గణపతి కార్యవాది కాని ఖడ్గవాది కాఁడు గనుక కార్యసాధనము నిమిత్తమై తిట్లన్నియుఁ బడెను. బెండ్లివారు మూటలు పరీక్ష చేయుదురేమో యని భయపడి గణపతి తనమూట తీసికొనిపోయి వేరొక యింట బెట్టెను. మొత్తము మీఁద దొంగతనము బయలు పడకుండ జాగ్రత్తపడి జోడు సంపాదించెను.