ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150

గ ణ ప తి

రా" నని బదులు చెప్పెను. తల్లి యది విని దిగులు గుండెతో నింటికి జని రెండు దినములు గడచిన తరువాత నొకనాఁడు సోదరుని జూచె యిట్లనియె "నాయనా ! కుఱ్ఱవాఁడింటికి వచ్చుట లేదు. ఎంతో బెదిరిపోయినాడు. వాండ్ల యింటను వీండ్ల యింటను దిరుగుచున్నాఁడు. దొరికిన పూట తినుచున్నాఁడు. లేనిపూట లేదు. చిక్కి శల్యమైనాడు. కన్నులు గుంటలు పట్టినవి. ఇంటిలో నడుగుబెట్టగానె నీవు చంపివైతువని భయము గలిగినది. నీవు రమ్మంటే వాఁడు నిర్భయముగ వచ్చి నీ పంక్తి నింత గంజి యన్నము దిని వెళ్లును. చిన్నప్పటినుండియు నీవే వాఁడు చేసిన తప్పులు భరించి పెంచినావు. చెడ్డ సహవాసములచేత జెడిపోయి నాఁడు. మేనమామవైన నీవే. తండ్రివైన నీవే వెనుకటి లాగుననె యీసారికూడ తప్పులు క్షమించి యింటికిరానీ, ఈ పర్యాయము గాడిద నెక్కకుండ బుద్ధి జెప్పెదను" అనవుడు సోదరీ వచనములకు భద్రాచల మిట్లనియె. "అమ్మాయీ ! గాడిద మీఁద వానిని జూచినప్పుడు నా కోపమాగక కుక్కను గొట్టినట్లు దుడ్డుకఱ్ఱతో గొట్టెదనని నేనన్నమాట నిజమే. దుడ్డుకఱ్ఱకాదు, వాఁడు చేసిన పనికి రోకలితో వాని తల చితుకబొడువవలయునని నాకున్నది. కాని కోపము వచ్చినప్పు డన్నంతమాట చేయగలమా? ఈ దుర్మార్గుని దుండగముల నన్నింటిని నేను కడుపులో బెట్టుకొని భరించలేదా? పేగు తీపిచేత నట్లు భరింపవలసి వచ్చినది. పాలకోసము ఱాయి మోయమన్నాఁడు. మన వంశము