ఈ పుట అచ్చుదిద్దబడ్డది

144

గ ణ ప తి

తండ్రియైన వసుదేవు డంతవాడు తన కాపద వచ్చినప్పుఁడు గాడిద కాళ్ళు పట్టుకొన్నాడా? ఏనుఁగు కాళ్ళు పట్టుకొన్నాడా? గోవు కాళ్లు పట్టుకొన్నాడా? గుఱ్ఱముకాళ్ళు పట్టుకొన్నాఁడా? ఆ మహాపత్సమయమున వసుదేవుఁడు దానికాళ్ళు పట్టుకొనకపోయిన పక్షమున కృష్ణమూర్తి బ్రతుకకనేపోవును. నేను దానిమీద నెక్కి తిని. కాని వసుదేవునిలాగ కాళ్ళు పట్టుకొనలేదు. గాడిద నెక్కుట తప్పని నా మేనమామఁకు దోఁచిన పక్షమున మంచి గుఱ్ఱము నొక దానిని కొని యిమ్మని చెప్పండి. అది యిచ్చెనా గాడిద నెక్కుట మానెదను.

గణపతి పలుకులు విని వారందఱు జిఱునగవు నవ్వి "వీని బ్రతుకు కాల. పొట్టచించి కంచుకాగడాల వెదకినను నొక్క యక్షరమైనను గానరాని వీఁడు తనపనికిఁ గావలసిన పురాణ సాంప్రదాయములఁ గూడ నెఱుఁగును. వీఁడు వసుదేవుని సాటువు దెచ్చికొన్నాఁడు. పొట్టివానికి బుద్ధులు పుట్టె డన్నమాట నిజమైనది. వీఁడు దేవతలకు సైతము పంచాంగము చెప్పఁగలవాఁడు. వీనికి మన ముత్తరము చెప్పలేము పదండి" యని వెడలిపోయిరి. గణపతి యొక్క ఖరవాహనారోహణ వృత్తాంతము విని యది యనార్యకార్య మనియు, నతఁడు సజ్జనదూరుఁ డనియు వట్టి నిర్భాగ్యుడనియు మీరు నిశ్చయింతురను సందియము కలుగుచున్నది.