ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142

గ ణ ప తి

చెవులు నొప్పి పెట్టుటచే నది మఱింత పరుగెత్తెను. అదృష్టవశము వలన నప్పుడు గార్ధభ యజమానుఁడగు చాకలివాడు ముందుకు బోయి యాపెను. అందుచే గణపతి నేల గూలుట తప్పెను. ఇంతలో నతని మేనమామ కొందఱు బాలకుల వలన మేనల్లుని ఖరవాహనారూఢ వృత్తాంతము విని కోపోద్రేకమున నొక దుడ్డుకఱ్ఱ చేతబట్టుకొని తిట్టుచు నతని కెదురుగా వచ్చెను. మేనమామను జూడగనే గణపతి వాహనముమీద నిలువలేక గుభాలున దాని మీఁద నుండి నేలకు దుమికి కాలి సత్తువకొలఁది పరుగెత్తెను. గణపతిమీఁద బడవలసిన దుడ్డుకఱ్ఱ తనమీఁద బడునేమో యని చాకలివాఁడు గాడిదె నక్కడ విడిచి పిక్కబలము జూపెను. వెంట నున్న పిల్లలు నానా దిశలకు బరుగెత్తిరి. పాఱిపోవుచున్న మేనల్లుని బట్టుకొనుట యసాధ్యమని మేనమామ వానివెంట నరుగక గణపతిని, గాడిదను, రజకుని నిందించుచు గృహంబున కరిగెను. అనంతరము మూడు దినముల వఱకు గణపతి మేనమామ యొక్క కోప శిఖవేఁడిమి మందగింపనందున ఇంటి కరుగుటకు వీలులేక పోయెను. "ఆ దౌర్భాగ్యుడు నా యింటికి వచ్చెనా కుక్కను కొట్టినట్లు దుడ్డుకఱ్ఱతోఁ గొట్టి చంపెదను. ఈ దుర్మార్గుని మూలమున నాకెన్నో తలవంపులు వచ్చుచున్నవి" యని మేనమామ తన్ను జూడవచ్చిన వారితో ననుచుండినట్లు గణపతికి వినవచ్చెను. మేనమామకు మిత్రులైన వారు కొందఱు గణపతిం గలిసికొని "కుఱ్ఱవాఁడా ! నీకిదేమి వినాశ