ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

141

యుపాయమే బాగున్నది. నీవే కట్టి తీసికొనిరా" యని చెప్పి వాఁడు కట్టితెచ్చిన త్రాటియాకుల గుది కళ్ళెముగఁ బెట్టి దానిని చేతఁబట్టుకుని వెనుక నడచుచుఁ జాకలివాఁడు గాడిదెను దోలుచుండ పై యుత్తరీయము కుచ్చువచ్చునట్లు తలకు జుట్టి చుట్ట వెలిగించి నోట బెట్టి గుప్పుగుప్పుమని పొగలెగయ నీత బెత్తముతో గాడిదను నడుమనడుమ గొట్టి యదలించుచు ముందుగా జాకలివాండ్ర యిండ్లదగ్గఱ తరువాత దక్కిన వీధుల వెంబడిని దిరిగెను. ఆ మహోత్సవము జూచుటకు వీధివీధిని బిన్నలు, పెద్దలు స్త్రీలుఁ బురుషులు గుమిగూడిరి. పట్టాభిషేక మహోత్సవ సమయమున బసిడియంబారివైచిన మదపుటేనుఁగు నెక్కి నగరమందు నూరేగు మహారాజుకైనను నైరావతము నెక్కి యమరావతి పురమునందు త్రిమ్మరు దేవేంద్రునికైనను నంతటి సంతోషము నంతటి గర్వము ప్రాభవమునుండదని నిశ్చయముగా జెప్పవచ్చును. గార్ధభవాహనారూఢుఁడైన గణపతి తన్ను ప్రజలు చూడవచ్చినప్పుడు సిగ్గుపడలేదు. చిన్నబోవలేదు. సందియము నందలేదు. జంకలేదు, ముప్పది నలువది మంది చిన్న పిల్లలు గార్ధభమువెనుక జేరి చప్పటలు జరచుచు గేకలు వైచుచు ద్రాటియాకులు, బుట్టలు, చేటలు వాయించుచు నల్లరిజేయసాగిరి. గాడిదె బెదరి పరుగిడజొచ్చెను. ఆతొందరలో నది త్రాటియాకుల కళ్ళెము తెగకొరికెను. గణపతి తన్ను గార్దభము పడవైచునని ముందుకు జరిగి వంగి దాని చెవులు గట్టిగా బట్టుకొనెను.