ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

133

పించెను. ఆమె సోదరుడును తన గదిలోనికిఁ బోయి నిద్రించెను. మరునాటి నుండి గనపతి యెప్పటియట్లె బడి పెద్దపులి యని భావించి యా గుమ్మ మెక్కక పోవుటయేగాక వేళకు భోజనము నకు రాక యెంత వెదకిన గనఁబడక రాత్రులుమాత్ర మింటికి వచ్చుచుండెను. మేనమామ విసిగి బండ చేయించి గణపతి కాలికి దగిలించెను. అతనిం జూచుటకు విద్యార్థులు తీర్థ ప్రజవలె వచ్చిరి. అభిమానధనుఁడైన గణపతి వారిని జూచి మొదట సిగ్గుపడియెను. కాని తరువాత సిగ్గు పడవలసిన యవసరము లేదనుకొని యెప్పటి యట్ల ముచ్చటలాడుచును మనసు గలసిన మిత్రులను బిలిచి యెవరు లేనప్పుడు వారితో "నోరీ ! మా మామ లోపల భోజనము చేయునప్పుడు దొంగతాళము తెచ్చి నా బండదీసి నన్ను వదిలించరా! హాయిగా మనమిద్దఱము తిరగవచ్చును" నని హెచ్చరించు చుండును. అతని యుపదేశ ప్రకార మొక రిద్దరతని కొకటి రెండు సారులు సాయము జేసిరి. ఈసారి యతఁడు సాయంకాల మింటికి రాక స్నేహితుల యిండ్లనె విందు లారగించుచు మేనమామకు నాలుగైదు దినములవఱకు గనఁబడక పోయెను. కనఁబడగానే మేనమామ యల్లునకు మొట్టికాయలు, గుద్దులు, చరపులు, చెంపకాయలు, తొడపాశములు కానుక యిచ్చి యలుకదీర్చి యింటికి దీసికొని వచ్చెను. ఇప్పటికి గణపతికి పదియేండ్లు నిండెను. అప్పుడప్పుడు పంతులు గుంటయోనమాలు వ్రాయించి చెప్పిన