ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

గ ణ ప తి

దన శరీరము గీచికొని కోతిపుండు బ్రహ్మరాక్షసియగునట్లు దానిని గొప్ప పుండు చేసికొని యెన్ని మందులు వైచినను పుండు మానకుండునట్లు ప్రయత్నముచేసి కొన్ని దినములు బడిమానెను. పాఠశాలాపత్తు తప్పించుకొనుటకై యతడు దాఁగని చోటు లేదు. ఎక్కని చెట్టు లేదు, దూరని డొంకలేదు. ఒకనాఁడు పొణకలోఁ గూర్చుండును. ఒకనాఁ డటకమీద నెక్కి కనబడకుండును. పాడుగృహములలోఁ గూర్చుండును. గణపతి బుద్ధి పాదరసమువంటి దగుటచేత బడియాపదఁ దప్పించుకొనుటకై యత డెన్నో ప్రయత్నములు చేసెను. కాని జీవచరిత్రలు సరిగా వ్రాయువారు లేకపోవుటచే నవియెల్ల మనకు దొరికినవికావు. చదువరుల యదృష్టవశమున నటువంటి వొకటి రెండు మాత్రము లభించినవి. అటువంటివి లభించినప్పుడు వ్రాయక పోవుట చరిత్రయెడ మహాదోషము జేయుటయని గ్రంథవిస్తర దోషమునకైన నొడఁబడి వాని నీక్రింద నుదాహరింపవలసివచ్చెను. గణపతి కొకనాఁడు తెల్లవారుజామున నాలుగు గడియల ప్రొద్దుండఁగా మెలకువ వచ్చెను. పెందలకడ మెలఁకువ వచ్చినప్పుడు దైవప్రార్థనము జేసుకొనవలసినదని తల్లియు మేనమామయు నతినితో జెప్పుచుందురు. కాని యట్టిపనిఁ జేయుట కతనికెన్నడవకాశము చిక్కలేదు. తెల్లవారుచున్న దనగానే పంతులు గారు, పాఠశాల పంతులుగారి చేతిలో బెత్తము వాని కన్నులకు గట్టినట్లెదుట కనఁబడుచుండును. ఆ యాపద నెట్లు