ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

గ ణ ప తి

యొకయింట నొక నులకమంచము కుక్కి మీఁదఁ బండుకొన్న దనుకొనుఁడు; దాని మొగముమీఁద తిరుగలి గంట్లవలె మాశూచకము మచ్చలున్న వనుకొనుఁడు; కుడికన్ను మెల్ల యనుకొనుఁడు; కుడి కంటిలో గొప్ప కందిగింజంత కాయ యనుకొనుఁడు. చేతులు మోరులు దిగినవనుకొనుడు, దొడ్డికాళ్ళను కొనుఁడు. మొదటనే గుజ్జురూప మనుకొనుఁడు, ఆగుజ్జునకు దగిన బొజ్జయున్న దనుకొనుఁడు. శరీరమునిండ రోమకళ యనుకొనుఁడు. మనస్సు మఱియొక పదార్థముమీదికి గాని యాలోచన మీఁదికి గాని చలింపకుండ నిశ్చలముచేసి యొక్కనిముసము మీరు ధ్యానము జేయుచు రేని గణపతి రూపము మీకు భావగోచర మగును.

గణపతి సహజముగానె వికృతరూపుఁడు. మశూచికమా మీద మెరుగులు దిద్దినది. మొదలే కోతి; యామీద దయ్యము పట్టిన దన్నట్లు మొదలే కురూపియైన వానికి మశూచికము వికారములు తెచ్చినపుడు వానియంద మిక వేరెచెప్ప వలయునా? గణపతి పుట్టిన రెండుమూడు మాసములకే గంగాధరుని తల్లియగు పిచ్చమ్మ కాలధర్మము నొందెను. గంగాధరుఁడు తన కుమారుఁడు చెడ్డ నక్షత్రమున జన్మించుటచె తనతల్లి మృతినొందె నని విచారించి నాయనమ్మ గండమున బుట్టిన వెధవఁ వీడని తరచుగాఁ దిట్టుచుండును. ఆ గ్రామమున జ్యోస్యుల జోగావధానులను గొప్పజ్యోతిశ్శాస్త్రజ్ఙ డుండెను. గంగాధరుఁ డాయన యొద్దకుఁ బోయి