ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

115

గురిచేసుకొనుటచేతను గంగాధరుఁడు కొంతసొమ్ము నిలవఁజేసెను. అతని యిల్లు ధనధాన్య సమృద్ధిగలదై వెలయుచుండెను. పలుమారు చూచి మందపల్లి నివాసుఁడైన కోట కోనప్ప యను బ్రాహ్మణుఁడు పిచ్చమ్మ బ్రతిమాలినమీదట రెండు సంవత్సరముల వయస్సుగల తన కూతురిని నాలుగు వందల రూపాయలు పుచ్చుకొని గంగాధరున కీయ నిశ్చయించెను. అప్పుడు గంగాధరునకు నలుబది సంవత్సరములు వయస్సు. ముక్కుపచ్చలారని చిన్నబిడ్డను నలుబదియేండ్ల వాని కిచ్చి పెండ్లి చేయుచున్నావాయని కోనప్పను కొందరడుగ నత డిట్లనియెను. దైవానుగ్రహము కావలెను కాని చిన్నయేమిటి పెద్దయేమిటి,మొన్న నీ మధ్య పదియేండ్లపిల్లను పదియాఱేండ్ల పిల్లవానికిచ్చి లక్షాధిపతియైన యొక బ్రాహ్మణుడు వివాహము జేసినాఁడు. మూఁడు నెలలు తిరగకుండఁగనే పిల్లవాఁడు పోయినాఁడు. మా పినతండ్రిగా రరువదియేండ్లు వచ్చిన తరువాత పెండ్లి జేసికొని నలుగురు కొడుకులను కన్నాఁడు. అదృష్టము ప్రధానము కాని వయస్సుకాదు. అది యదృష్టవంతురాలైన పక్షమున మందేశ్వర స్వామివారి యనుగ్రహముచేతనైనను దానికడుపున నాలుగు కాయలు కాయకపోవు. ఇంతకు గంగాధరునియొక్క వంశము నిలబెట్టి పున్నెము గట్టుకొనవలెనని మంచి యుద్దేశముతో పిల్లనిచ్చుచున్నాను. కాని యెల్లవారివలె నేను కేవలము డబ్బే ప్రధానముఁ జేసికొని పిల్ల నిచ్చుచున్న యాశాపాతకుడను కాను.