ఈ పుట ఆమోదించబడ్డది

10

గణపతి

తెల్లగా నుండును గావున నీ యర్థము నిర్వివాద మయ్యెను. చతుర్భుజ మనఁగా నాలుగు భుజములు గలది, గాడిదకు నాలుగు భుజము లుండుటవలనఁ జతుర్భుజశబ్దము సార్థక మనియెను. అవి భుజములు కావు; పాదము లని చదువరు లెవ్వరైనను సందియపడుదు రేమో, "నిరంకుశాః కవయః” యను నార్యోక్తి జ్ఞప్తికిఁ దెచ్చుకొనుఁడు. కవులు నిరంకుశులు, వారు పాదములు భుజములు చేయఁగలరు. భుజములు పాదములు చేయఁగలరు. ప్రసన్నవదన మనగా ప్రసన్నమైన ముఖము గలది. ప్రసన్నమైన మనస్సుతో చూచిన యెడల దాని మొగము ప్రసన్న మైయుండును. కావున నదియు నిర్వివాదమే. ఇటువంటి గాడిదను సర్వవిఘ్నోపశాంతి కొఱకు ధ్యానించుచున్నాఁడ నని యీ శ్లోకార్థమైనట్లు తన నిరుపమాన పాండిత్య ప్రకర్షము చేత నా విద్యాంసుఁడు విపరీతార్థము జెప్పి సమర్థించెను, గణపతి యనఁగా విఘ్నేశ్వరుఁడు; మహేశ్వరునియొద్ద పరమభక్తు లగు ప్రమథు లను దివ్యులు కొందరు గలరు. ఆ ప్రమథుల కే ప్రమథగణ మని పేరు. మహేశ్వరుఁడు నిర్హేతుక జాయమాన కటాక్షము చేతనో లేక నిరుద్యోగియైన తన కుమారుని నేదేని నొక యధికారమునం దుంచవలయునను నిచ్చ చేతనో, నాయకుఁడు లేనియెడల బ్రమథులు కట్టుతప్పి చెడిపోవుదు రను భయముచేతనో యా ప్రమథ గణమునకు వినాయకుని నాయకుని జేసెను, ఆ గణమునకధిపతి యగుటచేత వినాయకునకు గణపతి యను పేరు వచ్చెను. గణ