ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

101

చినిఁగిన శాలువలు బుజముల నలంకరించెను. ఒక కోమటి యందుకొన్న వెలయాలి చెల్లెలి నుంచుకొన్న నొక వంట బ్రాహ్మణుని కా కోమటి సిఫారసు జేసి పండితుఁ డని పిల్లకాసిప్పించెను. ఆబ్రాహ్మణుఁడు గూడ శాలు వెక్కడో యెరువు దెచ్చికొని తలకుఁ జుట్టుకొని యాపూటకు గరిటి యావలఁ బారవైచి గంటము దాఁటియాకు చేతఁ బుచ్చుకొని గొప్ప పండితునివలె కనఁబడెను. గంగాధరున కట్టి యుపాయము చెప్పువా రెవ్వరు లేకపోయిరి. అతనికి స్వయముగ నుపాయము తోఁచలేదు. తోఁడి వంటబ్రాహ్మణునకుఁ బిల్లకాసు దొరకుటయెగాక పండితుడని గౌరవము గూడ సభలోనఁ గలిగినందున గంగధరుని కడుపులో మంట హెచ్చెను. మనంబున మత్సరము వృద్ధిఁ బొందెను. పురవాసులపై నలుక రెట్టింపయ్యెను. ఆనాఁటి కెట్లో కోపము లోలోపల జీర్ణముఁ జేసికొని యతఁ డింటికిఁబోయి సదస్యము నాఁడెక్కువ సంభావన దెచ్చుకొనుట కుపాయము వెదకుఁచు దనచేత నీళ్ళుమోయించుకొను నొకరిద్దరు పెద్దమనుష్యుల యెద్దకు వెళ్ళి సిఫార సిమ్మని యడిగెను. "నీవుఘనాపాఠివా? షోడశ కర్మాధికారివా? మహాపండితుడవా? ఏమని నీకు నేను సిఫారసు నియ్యఁగలను? నీళ్ళ బ్రాహ్మణునకు సిఫారసిచ్చిన పక్షమున నాగౌరవ ముండునా?" అని యొకఁడు బదులు చెప్పెను. "నేను పెండ్లివారి నెఱుఁగ" నని మఱియొకఁడు త్తరముఁ జెప్పెను. ఆ పలుకులు వినఁగానె గంగా