ఈ పుట ఆమోదించబడ్డది

గణపతి

మొదటి ప్రకరణము

"శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వవిఘ్నోపశాంతయే"

అని విఘ్నేశ్వర దేవతానీకమైన స్తుతిశ్లోక మొకటి కలదు. "తెల్లని వస్త్రములు ధరించువాఁడు, సర్వవ్యాపకుడు చంద్రునివలె ధవళమైనవాఁడు, నాలుగు భుజములుగలవాడు, ప్రసన్నమైన మొగముగలవాఁడు నగు విఘ్నేశ్వరుని సర్వ విఘ్న శాంతికొరకు ధ్యానించుచున్నాఁడ" నని యాశ్లోకమున కర్థము. సర్వతోముఖ పాండిత్యముగల యొకానొక బుద్ధిమంతుఁడు చమత్కారముగ నీశ్లోకము గాడిద నుద్దేశించి చెప్పఁబడిన దని విపరీతార్థము గల్పించి చెప్పెను. అది యెట్లనఁగా శుక్లాంబరధరం అనఁగా ధవళవస్త్రములు ధరించునది, చాకలివాఁ డుదికిన తెల్లనివస్త్రములు మోయునది గావున నీ శబ్దము గాడిదకే యర్థ మగుచున్నదని చెప్పెను. విష్ణుశబ్దమునకు సర్వవ్యాపకత్వ మర్థ మున్నది గదా. గాడిద యెక్కడ చూచిన నక్కడే కనఁబడు చుండును. కావున నిక్కడ విష్ణుశబ్దమునకు గాడిదయే యర్థ మని వాక్రుచ్చెను. శశివర్ణ మనఁగా చంద్రునివలె ధవళమైనది, గాడిద