పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/94

ఈ పుట ఆమోదించబడ్డది

ఆ రోజుల్లో కుంజుస్వామీ రామనాథయ్యరూ పలాకొత్తుకు పోయే దారికి ప్రక్కగానున్నరూములో వుండేవారట. ఉభయులూ భోజనంచేసి వసారా తిన్నెమీద కూర్చుని ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకుంటూ ప్రసంగ వశంగా 'ఇదిగో కుంజుస్వామీ! రేపటి నుండి మీరున్నూ వేదాధ్యయనం చేయవచ్చును. భగవాన్ తీర్మానం చేశారీవాళ' అన్నారట రామనాథయ్యర్. వారు ఆమాట అంటూ వుండగానే భోజనానంతరం పలాకొత్తుకు వెళ్ళి తిరిగివచ్చే భగవాన్ వారిని సమీపిస్తూ 'ఆ - నేనా తీర్మానం చేసింది! అధ్యయనం చేయవచ్చును అని నే ననలేదే?' అన్నారట భగవాన్.

వాళ్ళిద్దరు ఉలిక్కిపడి లేచారట. రామనాథయ్యర్ చేతులు జోడిస్తూ 'భగవాన్! ఇంతకు ముందే హాల్లో శంకరం వ్రాసిన చరిత్రలో అన్ని జాతుల వారున్నా వేదాధ్యయనం చేయవచ్చు నన్నది సరిచూచారు గదా?' అన్నారట. 'అవును చూచాను. అభ్యాసమని దిద్దాను గదా' అన్నారట భగవాన్. 'అధ్యయనానికి అభ్యాసానికి భేదం వున్నదా?' అన్నారట అయ్యర్. 'లేకేమి వేద మంటే జ్ఞానమని యర్థం. అందువల్ల వేదాభ్యాసం చేయవచ్చు నన్నమాట. అంతేగాని వేదాధ్యయనం చేయవచ్చునని నే ననలేదే' అన్నారట భగవాన్.*[1]

  1. * శ్రీ రమణాశ్రమ లేఖలు-సూరి నాగమ్మ పుటలు 631, 632.