పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/88

ఈ పుట ఆమోదించబడ్డది

నెల్లూరు సమీపమున పల్లెపాడులో విప్రవిద్యాలయమును స్థాపించి మిగులనైష్ఠికుడై యుండిన చతుర్వేదుల రాఘవయ్య గారి కుమారుడు. తండ్రి ఎంతో ఆచారపరుడైనను వేంకట కృష్ణయ్య గాంధీగారి యాశ్రమములలో చేరి సకల కర్మలను వదలుకొనెను. అందువలన అతడు నాయనతో ఇట్లనెను. "మీరు కర్మలు చేయవలెనని చెప్పుచున్నారు. బాగానేయున్నది. నేను గాంధీగారి యాశ్రమములో అన్నిజాతులవారితో కలిసి భోజనము చేసినవాడను. నేను తద్దినము పెట్టవలెనన్నచో ఏ బ్రాహ్మణుడు వచ్చి నాచేత తద్దినము పెట్టించును? రేపే మాతల్లి తద్దినము." "నీకు పెట్టవలయునని శ్రద్ద యున్నచో నేనే పెట్టింతును" అని నాయన అనెను. అందఱును దిగ్ర్భాంతులైరి. "భోక్త లెక్కడ దొరుకుదు"రని వేంకట కృష్ణయ్య అనెను. వెంటనే నాయన ఎదుట కూర్చుండి యున్న వారిని కలయజూచి ఓరుగంటి వేంకట కృష్ణయ్యను ఒక భోక్తనుగా ఉండుమని చెప్పి, అగ్నిహోత్రుడే రెండవభోక్త అగుననెను. ఈ సందర్భమును ఓరుగంటి వేంకట కృష్ణయ్య ఇట్లు వివరించెను.

"మఱునాడు శ్రాద్ధ కార్యము నెఱవేరినది. నాయన మంత్రోచ్చారణము చేయుచుండగా కష్టసహములైన (కష్టముతో సహింప దగినవి) శక్తి తరంగములు నా యొడలిలో (శరీరములో) ప్రవహించుచుండినవి. పురోహితుడు నాయన ఆయనకు నే ననుచరు డగుట యదియే ప్రారంభము.