పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/85

ఈ పుట ఆమోదించబడ్డది

గ్రంథములు అన్ని ప్రాంతములలో అన్ని తరములవారికి చక్కగా బోధపడుచు విజ్ఞానమును అందించుచుండినవి. తిక్కన్నగారు నెల్లూరి మాండలికములో, పోతన్నగారు ఓరుగంటిలోని వ్యావహారిక బాషలో గ్రంథములు వ్రాసియుండినచో అవి ఈనాటికి మనకు నిరుపయోగములై యుండెడివి. వారు గ్రాంథికశైలిలో వ్రాయుట వలననే భారత భాగవతములు ఈనాటికి దేశమున అన్ని ప్రాంతములలో సజీవములై యున్నవి. గ్రాంథిక మన్నంతనే సమాన జటిలమైన బాష యని గ్రహింపరాదు. గ్రాంథికశైలిలో వచనమే కాదు, పద్యములను కూడ ఎంత సులభముగానైన రచింపవచ్చును. "ఇందు గల డందు లేడను సందేహము వలదు" మొదలైన పద్యములే ఇందులకు నిదర్శనము. వేమన పద్యములు ఎంత సులభములో అందఱు ఎఱిగినదే.

దినపత్రికలలో ఆంగ్లమును అత్యంతము పటిష్ఠమైన భాషలో వ్రాయుచు చదువుచు ఆనందించుచున్న నేటి బుద్దిమంతులు మాతృభాష విషయమున మాత్రము నోటికివచ్చినట్లు వ్రాయు చుండుట చాల శోచనీయము. పరభాషయందున్న శ్రద్ధ మాతృభాషయందు కూడ ఉండవలయు నని ఈ మేధావులకు ఏల తోచదో తెలియదు. శుచిగా రుచిగా వండిపెట్టుటకు బద్ధకించి బజారులోని చిఱుతిండిని చిన్నపిల్లలకు మఱపినట్టు, తమ సోమరితనమువలన ఈ రచయితలు జనులకు పామరభాషను పత్రికలలో మఱపి వారి హితమును పాటింపక వారికి గ్రాంథికశైలి యన్నచో ఏవగింపు కలుగునట్లు చేసి, మన పూర్వవిజ్ఞానమునకు దూర మొనరించి వారికి తీరని ద్రోహమును చేయుచున్నారు.