పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/82

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రపంచములో ఈనాటికి ఏ కొంచమైనను మనకు గౌరవము వున్నదన్నచో, అది అనాదియైన వేదశాస్త్ర విజ్ఞానము వల్లనేకాని మన యార్థిక సంపదవలన కాదు. రాజకీయ సామర్థ్యమువలన కాదు. ఆ వేదశాస్త్ర విజ్ఞాన భాండాగారమునకు సంస్కృత భాషయే తాళపు చెవి. దానివలన తప్ప మఱియే సాధనమువలన మనకు ఆ విజ్ఞానము నందు ప్రవేశము కాని, దేశ సమైక్యముకాని, అభ్యుదయము కాని, ప్రపంచమున గౌరవ ప్రపత్తులుకాని ఏర్పడవు.

బెల్గాము నుండి నాయన గోకర్ణమునకు వచ్చి దైవరాతుని యింట రెండు నెలలు, బొంబాయిలో ఒక నెల శిష్యులయొద్ద నుండి తిరువణ్ణామలై చేరెను. 1925 జూలై నుండి మూడు నెలలు నాయన అతిమూత్ర వ్యాధితో బాధపడెను. ఆయన చూత గుహలో వుండి పెక్కు సూత్ర గ్రంథములను, విశ్వ మీమాంస అను 393 శ్లోకముల గ్రంథమును రచించెను. ఆ సమయమున సుబ్రమణ్య అయ్యరు అనునొక కాంగ్రెసు సభ్యుడు అన్ని జాతుల విద్యార్థులకు ఏక పంక్తి భోజనములను ఏర్పఱచుచు ద్రవిడ దేశమున శర్మ దేవీ క్షేత్రము నందు ఒక గురుకులమును నెలకొల్పెను. అందు ఆయన బ్రాహ్మణుని వంట వానినిగా నియమించెను. ఆ విషయమును బ్రాహ్మణేతరులు ఆక్షేపించిరి. ఆ వివాదము పరిష్కారము కొఱకు నాయన యొద్దకు వచ్చెను. "పంచముని వంట వానినిగా వుంచుట పరిష్కారము" అని నాయన తీర్పు చెప్పెను. అది బ్రాహ్మణేతరులకు కూడ నచ్చలేదు. ఇంతలో హఠాత్తుగా సుబ్రమణ్య అయ్యరు మరణించి ఆ గురుకులము మూల బడెను.