పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/81

ఈ పుట ఆమోదించబడ్డది

శాస్త్ర సమ్మతమని సంస్కృతమున ఉపన్యసించెను. మఱునాడు హిందీ జాతీయ బాష కావలెనని గాంధిచే ప్రతిపాదింపబడిన తీర్మానమును ఖండించుటకు నాయన పూనుకొనెను. క్రిందటి దినము తమకు అనుకూలముగానున్న ప్రసంగమునకు ఆనందించిన గాంధి తన ప్రతిపాదనమును కాదన్న వాసిష్ఠుని ప్రసంగింపకుండ నివారించెను. అనుమతి లభించియున్నచో ఆ సభలో వాసిష్ఠుడు మనకు సంస్కృతమే జాతీయ భాషయని ఉద్ఘాటించి యుండెడి వాడు. నాయకులు అభిప్రాయ భేదమునుకూడ సహింప లేకున్నారని గ్రహించి వాసిష్ఠుడు వెంటనే సభ్యత్వమునకు రాజీనామాను ఇచ్చి రాజకీయముల నుండి బయల్పడెను. అయినను ఆయన దేశభక్తిని వీడక రాష్ట్ర విభాగములను గూర్చి "రాష్ట్ర నిబంధనము" అను గ్రంథమును రచించెను.

సంస్కృతము ప్రపంచ భాష కావలెనని నాయన "లాలి భాషోపదేశ:" అను గ్రంథమును కూడ రచించినాడు. దాని ప్రాశస్త్యమును శ్రీ అప్పల సోమేశ్వర శర్మ ఇట్లు ఉద్ఘాటించినాడు. "అటువంటి మహానుభావుని బహుసంఖ్యాక రచనలలో 'లాలి భాషోపదేశం' ఒకటి,. సంస్కృత భాషను దేశ కాలానుగుణంగా సంస్కరించి, పునరుజ్జీవనాన్ని సౌలభ్యాన్ని ప్రచారాన్ని సంపాదించి దానికి ప్రపంచ భాషా సామ్రాజ్య పట్టాభిషేకాన్ని చేయాలని ఈ రచన తహ తహలాడుతుంది. 'లాలి భాష' అన్న పేరే బహు చిత్రంగాను, మధురంగాను వుంది...... 'లాలి పాట' లాగా 'లాలి భాష' సర్వజనావర్జకం అవుతుందని, కావాలని గ్రంథకర్త అభిసంధి అయి వుండవచ్చు...[1]

  1. * జయంతి సంచిక పుట 12