పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/77

ఈ పుట ఆమోదించబడ్డది

యావిరి యొక్క వేగము తగ్గెను. ఆ రాత్రియంతయు నాయన ఆవిరివలన తాపము, లోపల చందన శీతలత్వమును అనుభవించు చుండెను.

తెల్లవారిన తరువాత భగవానుడు చూతగుహకు వచ్చి జరిగిన దంతయు విని సంతసించి స్వయముగా నాయనను గుహలోనుండి గదిలోనికి తీసుకొనివచ్చి మంచముపై కూర్చుండబెట్టి ఆయనకు పాలను ఇప్పించెను. భగవానుడు నాయన తలను పరీక్షించెను. ఆశ్చర్యముగా అరచేయి మేర జుట్టు అంతయు ఒక్క రాత్రికే ఊడిపోయెను. మహర్షి అ శిరస్సును కొంతసేపు నిమిరి, ఆయనకు సేవ చేయుచున్న చిరుపాకం కొండయ్యను పంపి పాదుకల జత, బాదము తైలము, చిట్టాముదము తెప్పించుచు విశాలక్షమ్మతో ఇట్లనెను. "నాయనకు ఇంక భయము లేదు. కాని శరీరమంతయు విద్యుచ్ఛక్తితో కూడియున్నది. ఇంక వీరి శరీరము లోహముయొక్క స్పర్శనుగాని, ఆహారమున ఉప్పుకారములను గాని భరింపజాలదు. వీరు వట్టి నేలపై కూర్చుండరాదు; గదిలోనైన పాదరక్షలు లేకుండ తిరుగరాదు. స్నానమునకు ముందు తలకు బాదము తైలమును, తరువాత చిట్టాముదమును పట్టింపుడు". ఇట్లు చెప్పి మహర్షి తల్లిసేవ చేయుటకై వెడలిపోయెను.

నాయన కపాల భేదనమున కలిగిన యనుభూతులను కొన్నింటిని ఉమా సహస్రమున చేర్చి ఎనిమిదవ పర్యాయము దానిని సంస్కరించి అపీతకుచాంబా సన్నిధియందు పఠించెను. తరువాత నాయన ఇంద్రాణి సప్తశతిని 20 దినములలో పూర్తి చేసెను.