పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/75

ఈ పుట ఆమోదించబడ్డది

నేను అశక్తుడనైయున్నాను. ప్రభూ! నాయందు స్నేహము (చమురు) ఉన్నది; దశ (వత్తి) ఉన్నది. దీనిని వెలిగించుటకు దయతో నీ కటాక్ష జ్యోతిస్సును కొంచెము అనుగ్రహింపుము. నేను ముందునకు పోవుదును."

ఈ బావన అప్పటి ఆయనయొక్క మన:పరిస్థితిని చక్కగా వ్యక్తము చేయుచున్నది.

1922 జనవరిలో మహాదేవుడు చదువు వదిలి ఉపాధ్యాయు డయ్యెను. నాయన అమ్మతో చెన్నపురము చేరి మార్చి చివర వఱకు నుండెను. అప్పు డాయన శిష్యుల కొఱకు యోగసాధన రహస్యములను సూత్రములనుగా రచించెను. అది తరువాత "రాజయోగసారము" అను గ్రంథమయ్యెను. అప్పుడాయన ఒక సందర్భమున పండితులతో నిట్లనెను. "మంత్రధ్యానము చేతనే నాకు నిరుపాధిక ధ్యానయోగ మలవడెను. అది దైవ కటాక్షమే. ఆ కటాక్షమునకు గురు కటాక్షముకూడ తోడై నాయం దా యోగము స్థిరమై, శక్తిని వృద్దిపరచెను... ఈ నిర్విషయ విమర్శయోగ మలవడుకొలది, ఈ జగద్వ్యవహారము లెన్ని యున్నను నా యాంతర్య మందీ యోగసాధనము నిరంతరము కాజొచ్చెను. ఇది యెప్పుడు సిద్ధి బొందునో చెప్పజాలను."[1]

  1. * నాయన-పుటలు:493, 494