పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/66

ఈ పుట ఆమోదించబడ్డది

తిథులందు నాయన ఊరిలోని విద్యాపీఠమునకు పోయి పండితుల సందేహములను తీర్చుచు తన పరిశోధన విషయములను వారికి చెప్పుచుండెను.

నాలుగు నెలలు ఇట్లు గడిచెను. 1912 డిసెంబరులో తండ్రికి అవసానదశ వచ్చెనని తెలిసి నాయన కలువఱాయికి పోయెను. ప్రయాణములో కలిగిన యాటంకమువలన ఆయన చేరునప్పటికి కొన్ని గంటలకు ముందే నరసింహశాస్త్రి స్వర్గస్థుడయ్యెను. తండ్రియొక్క కర్మక్రతువు లైన పిదప నాయన అరుణాచలమున మహర్షిని దర్శించి గోకర్ణమునకు వచ్చెను.

గోకర్ణ సమీపమున "సన్నబేలా" అను గ్రామమునందు ఉప్పుందోపాధ్యాయుడు జ్యోతిష్టోమ యజ్ఞమును సంకల్పించి దానికి బృహస్పతినిగా నాయనను వరించెను. దాని యేర్పాటులకై డిశంబరు మూడవ వారములోనే నాయన సకుటుంబముగా అక్కడ ఒక యాశ్రమమున బసచేసెను. ఆ యజ్ఞము ఫాల్గున బహుళ పక్షమున ఆరంభింపబడి 1913 ఏప్రిలులో చైత్ర శుద్ధమున ముగిసెను. ప్రతిదినము నాయన యజ్ఞకర్మ మంత్రముల యర్థములను వివరించుచుండెను. యజ్ఞముయొక్క ఉపసంహారమునందు ఆయన కన్నడమున అనర్గళముగా ఉపన్యసించి అందఱకు ఆశ్చర్యమును ఆనందమును కలిగించెను. పిమ్మట ఆయన యజ్ఞమునకు జయమును గూర్చిన యింద్రాణియొక్క మంత్రమును మౌనదీక్షతో వారము దినములు జపించెను.