పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/40

ఈ పుట ఆమోదించబడ్డది

భావదాస్యముచే ప్రభువులు వ్రాయించినవన్నియు సత్యములని జనులు గ్రహించుచుండిరి. మన పురాణములను రచించిన కవులు మనవారైనను తమకున్న మహత్తర కవితా ప్రజ్ఞ నిట్లు నీచకథలను పరివ్యాప్త మొనర్చుట కియ్యకొనినట్లు నాకు దోచుచున్నది. ఒకదాని నొకటి పోలని యీ పురాణములకు ప్రామాణ్యముల నిచ్చు మన పండితులు సైత మందలి కల్పిత కథలను విమర్శింపకుండుట శోచనీయమై యున్నది. అట్టి కథల నందుండి తొలగించినచో మనకు అవి యన్నివిధముల పూజా గ్రంథములు కాగల్గునని నా నమ్మిక"[1]

ఒకనాడు రంగయ్య "దేనిని గురించి మీరింత దీర్ఘముగా మాటిమాటికి ధ్యానించుచుంటిరి." అని అడుగగా కావ్యకంఠుడు "దశాం దేశ స్యైతాం ప్రతిపద మయం ధ్యాయతి జన:" (ఈ దేశముయొక్క దశనే మాటిమాటికి ఈ జనుడు తలపోయు చున్నాడు) అని చెప్పి తన యభిప్రాయములను రెండుశ్లోకములలో వ్యక్తీకరించెను. దీనిని బట్టి భారతజాతి యొక్క దుర్గతిని గూర్చి ఆయన ఎంతగా పరితపించుచుండెనో స్పష్ట మగుచున్నది.

చెన్నపురి నుండి కావ్యకంఠుడు తిరువణ్ణామలై చేరిన కొన్నాళ్లకు రంగయ్య రామస్వామితో కూడివచ్చి వేలూరులోని క్రైస్తవ కళాశాలలో ఆంధ్ర భాషాధ్యాపకపదవిని స్వీకరింపుడని

  1. * నాయన - పుటలు 175, 176