పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/38

ఈ పుట ఆమోదించబడ్డది

5. దేశోద్ధరణ కాంక్ష

శంకరశాస్త్రి అను వ్యక్తికూడ కావ్యకంఠునిచే తనకు పూర్వ జన్మ కింకరుడుగా గుర్తింపబడి దొరస్వామికి తోడయ్యెను. వీరిద్దఱి వలన విద్యార్థులు గుంపులు గుంపులుగా ఆయనవద్దకు వచ్చుచుండిరి. వారు ఆయనను సముద్రతీరమునకు తీసికొనిపోయి దేశోద్ధరణమునకు ఉపాయములను చర్చింపజొచ్చిరి. ఆయన వారికి వేద రహస్యముల యుత్కృష్టతను, ఋషుల తపశ్శక్తుల మహిమలను బోధించుచు నిట్లు చెప్పుచుండెను. "........సన్యాసి వేషములు బుద్దునికాలమునుండి మన కొంప ముంచినవి. కాషాయ ముండనములందున్న మన గౌరవమును జూచి మన కన్నివిధముల క్షారమొనర్చుట కితర దేశస్థులు పరంపరలుగా మనదేశమును కొల్లగొట్టిరి. శుష్క వైరాగ్యము నాశ్రయించిన ఈ వేషధారులు మనసంఘమధ్యమందే నిర్వ్యాపారులై విహరించుచు తమ కుక్షి కొఱకు మన కుక్షులను హరించుచున్నారు. వీరియం దనాదరణము జూపియైన వీరిని గార్హస్థ్యమునకు మరల్చుట మన జాతి కవసరమగు ప్రథమ సంస్కారము. రెండవది గోచి గావంచా సాంప్రదాయము లెట్లితర దేశస్థులచే మనయందు పరిహసింప బడుచున్నవో గుర్తించి మనలను నవ్వులపాలు చేయని విధమున సాంప్రదాయములను సంస్కరించుకొనుట. అట్లే మన కాదర్శ ప్రాయులైన ఋషులను నీచబరచు విధమున అల్లబడిన దుష్ట కథలను పురాణములనుండి, కావ్యప్రబంధ నాటకాది గ్రంథముల నుండి తొలగించి యట్టిధోరణిని కవులందు నిరసించుట మూడవది. మన జాతియందు వీర్యబలతేజములు తిరుగ వర్ధిల్లుటకై స్త్రీ పురుష విచక్షణలుగాని వర్ణభేదములుగాని మంత్రధ్యానము కొఱకు