పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/37

ఈ పుట ఆమోదించబడ్డది

పారవశ్యమున లేచి ఆయనకు పాదాభివందనము గావించెను. అప్పుడు ఆయన అతనిని పూర్వజన్మ కింకరుడైన సుధన్వునిగా గుర్తించెను.

విద్యార్థులు, పౌరులు కావ్యకంఠుని సమ్మానించుటకు పూనుకొనిరి. ఆ సమయమునకు "బాలసరస్వతి", "భట్టశ్రీ" బిరుదములు గల సుదర్శనుడు అను సుప్రసిద్ధ పండితుడు అచ్చటికి వచ్చెను. ఆయనకుకూడ సమ్మానము కావింప వలయునని కొందఱు పట్టుపట్టిరి. సమ్మానసభవారు ఒక బంగారు తోడాను చేయించి ఇరువురిలో వాదమున జయించినవానికి దానిని బహూకరింప నిశ్చయించిరి. ఈ లోపల తిరువళిక్కేణి పాఠశాలలో ఏర్పాటు చేయబడిన సభలో కావ్యకంఠుడు వేదము వేంకటరాయశాస్త్రి మొదలగువారు ఇచ్చిన యేబది సమస్యలను వెంట వెంటనే పూరించి సమ్మానింపబడెను.

భట్టశ్రీ కావ్యకంఠుల వివాదసభ కృష్ణస్వామి అయ్యరు అధ్యక్షతయందు మైలాపూరులో జరిగెను. అందు కావ్యకంఠుడు విజేతయై "తోడా" ను పొందెను. మఱియొక సభయందు భట్టశ్రీ అధ్యక్షుడుగా నుండి కావ్యకంఠుని అవమానించుటకు కుతంత్రమును పన్నెను. కావ్యకంఠుడు భట్టశ్రీయొక్క దౌర్జన్యమును, మోసమును పాండిత్య హీనతను నిరూపించి మహాజనుల యభినందనములకు పాత్రుడయ్యెను.