4. కవితా వైభవము
గణపతిశాస్త్రి అప్పటికి వేదాధ్యయనము కావింపలేదు. ఆ కొఱతను తీర్చుకొనుటకై ఆయన వేద పాఠశాలలోని యొక పండితునియొద్ద ఒక సంవత్సరములో వేదమును అధ్యయన మొనర్చెను. పిమ్మట సాయణాచార్య భాష్యముతో వేదార్థమును గ్రహించి గురువునకే బోధించెను.
"వాసిష్ట వైభవము" నందు పుత్రునకు ఉపనయనము చేసిన తరువాత వేలూరునందే నాయన ఋక్ సంహితను అధ్యయనము గావించి సాయణభాష్యమును పరిశీలించి నట్లున్నది. "వత్సస్య మహాదేవస్య ఉపనయన మహోత్సవాయ గృహంగత్వా, తతో౽రుణాచల మేత్య మహర్షే రాశిషం ప్రాప్య పుత్రకస్య బ్రహ్మణ్యం సంస్కారం నిరవర్తయమ్ ... ఋక్సంహితాం సస్వరాం వేలూరుపుర ఏవ అశిక్షే సావధానం సాయణీయ భాష్యంచ సమాలోకషి||[1]
క్రమక్రమముగా కావ్యకంఠుని కీర్తి ప్రసరించి ఆయనను దర్శించుటకు అనేకులు రాజొచ్చిరి. ఒకనాడు చెన్నపురి హైకోర్టులో గుమస్తాగాఉన్న శాతంజేరి రామస్వామి అయ్యరు వచ్చెను. తన తాతయైన ఉపనిషద్ర్బహ్మమే గణపతిశాస్త్రిగా అవతరించెనని అతనికి తోచెను. వెంటనే అతడు గణపతిశాస్త్రికి పాదాభివందనము గావించి శిష్యుడయ్యెను. అతని ప్రేరణమున కొన్నాళ్ళకు కావ్యకంఠుడు చెన్నపురమునకేగెను. అక్కడ హైకోర్టు వకీలుగా ఉన్న పంచాపకేశశాస్త్రి తనతోకూడ వేదము వేంకటరాయశాస్త్రిని,
- ↑ *16. ప్రకరణం - 166