3. బ్రాహ్మణ స్వామి దర్శనము
బిరుద విభ్రాజితుడై గణపతిశాస్త్రి వైద్యనాథ క్షేత్రమున కేగి తపస్సును చేయుచు సురేశ మిత్రు డను పండితుని వలన తారా మంత్రోపదేశమును పొంది, మహాదీక్షతో జపించి మంత్రసిద్ధి నొందెను. పదవనాటి రాత్రి కలలో శివుడు కన్పించి నిర్విషయ ధ్యానరూపమైన స్మృతి మార్గమును చూపి కావ్యకంఠునిపై విభూతిని చల్లి మాయ మయ్యెను. తరువాత కావ్యకంఠుడు 'గహ్వాల' (గర్హ్వాల) సంస్థానాధిపతిని దర్శించి చతురంగమున ఆయన యొద్దనున్న యష్టదిగ్గజములవంటి వారిని ఓడించెను. ఆయన పళ్లెరము నిండ రూప్యముల నుంచి నమస్కరించినను కావ్యకంఠుడు పవిత్ర మనస్కులకు అత్యాశ తగదని మార్గ వ్యయమునకు కావలసిన పది రూప్యములను మాత్రమే స్వీకరించెను. ఆ ధనముతో ఆయన కాశికిచేరి, అటునుండి కాన్పూరునకు పోయెను. అక్కడ మూడు మాసములు స్మృతి మార్గము నవలంబించి ఆయన జపధ్యానములు సలిపెను.
అప్పుడు ఇంటికి రమ్మని తండ్రి వ్రాయగా కావ్యకంఠుడు వెంటనే కలువఱాయికి చేరెను. నేత్ర వ్యాధితో బాధపడుచున్న తండ్రికి సేవ చేయుచు ఆయన అచ్చటనే పదునైదు మాసములు వుండి, ఆయుర్వేదమును మధించి చికిత్స చేసి ఆయనకు దృష్టి చక్కబడునట్లు చేసెను.
తండ్రి యభిప్రాయమును అనుసరించి గణపతిశాస్త్రి భార్యతో కూడ 1902 మార్చి నెలలో నందిగ్రామము మీదుగా మందసా చేరి అచ్చట రాజకుటుంబము యొక్క ఆతిథ్యమును