పాండిత్యమున ఆశు కవిత్వము నందు ఉత్తర దేశమున అద్వితీయుడుగా ప్రసిద్దుడైన అంబికాదత్తుడు అ సంవత్సరము పరీక్షలకు అధ్యక్షుడుగా నుండెను. సభలో ప్రవేశించుచు గణపతి అధ్యక్షుని చూచి చాపలముతో 'ఈయన ఎవరు' అని వాచస్పతిని పెద్దగా అడిగెను. అధ్యక్షుడు ఆ మాట విని చిరునవ్వుతో 'శ్లో|| సత్వర కవితాసవితా, గౌడోహం కశ్చిదంబికా దత్త:|' (సత్వరముగా కవిత్వమును చెప్పగల గౌడుడను అంబికాదత్తుడను) అని శ్లోకమున సగము చెప్పెను. వెంటనే 'గణపతి రితి కవి కులపతి, రతిదక్షో దాక్షిణాత్యోహమ్||' (నేను గణపతి అను కవి కులపతిని, అతి దక్షుడను, దాక్షిణాత్యుడను) అని గణపతి శ్లోకమున ఉత్తరార్ధమును పూరించెను. అంతటితో నూరకుండక గణపతి 'భవాన్‌దత్త: అహం త్మౌరస:' (మీరు అంబికకు దత్త పుత్రులు; నేను ఔరసుడను) అనెను. ఎల్లరును బాల పండితుని సాహసమునకు నివ్వెఱపడిరి. అంబికాదత్తుడు గణపతిని వేదికపైకి ఆహ్వానించి పరంపరగా నాలుగు సమస్యల నిచ్చెను. అడిగినదే తడవుగా అన్నింటిని గణపతి అద్భుతముగా పూరించెను. తరువాత వారి కిరువురకు స్పర్థతో వివాదము విజృంభించెను. తుదకు కవిత్వ పటుత్వమునకు నిరర్గళధారకు అంబికాదత్తుడు సంతోషించి గణపతిని కౌగిలించుకొని యభినందించెను. పిదప పరీక్షకుల యభిమతము ననుసరించి గణపతి పదునెనిమిది శ్లోకములలో భారత కథను సరసముగా ఆశువుగా చెప్పెను. అధ్యక్షు డంతటితో పరీక్షను నిలిపి గణపతికి "కావ్యకంఠ" బిరుదము నొసంగవలయునని ప్రకటించెను. అట్లే ఆ విద్వత్పరిషత్తువారు 20 - 6 - 1900 తేది కావ్యకంఠోపహార ప్రశంసా పత్రము నొసంగి గణపతిని మిగుల సమ్మానించిరి.
పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/29
ఈ పుట ఆమోదించబడ్డది