పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/25

ఈ పుట ఆమోదించబడ్డది

2. కావ్యకంఠ బిరుద సత్కారము

గణపతికి తపస్సు చేయవలయునను కాంక్ష తీవ్రమయ్యెను. శ్రావణ మాసము నోములకు భార్యను పుట్టింటివారు తీసికొని పోవుట మంచి యవకాశముగా భావించి గణపతి యొకనాడు రహస్యముగా వేంకటశాస్త్రియను మిత్రునితో అన్నయైన భీమశాస్త్రితో బయలుదేరి 1896 వ సంవత్సరము ఆగష్టు నెలాఖరుకు రాజమహేంద్రవరమును చేరెను. భీమశాస్త్రి జంకుతో ఇంటికి తిరిగి వచ్చెను. గణపతి వేంకట శాస్త్రితో కోనసీమలో పేరమ్మ యగ్రహారమున కౌశికి నది యొడ్డున తపస్సునకు ఉపక్రమించెను. సుమారు రెండు మాసములు దీక్షతో శివ పంచాక్షరి, మహాగణపతి మంత్రములను జపించినను అతనికి ఫలితము కన్పించలేదు. కొన్ని దినములకు వేంకటశాస్త్రి కూడ వెడలిపోయెను. గణపతి కాశికి పోదలచి నంది గ్రామమునకు చేరి అచ్చట జ్యోతిష ప్రజ్ఞ చేత ధర్మశాలాధికారియైన కృష్ణమ్మనాయుని యభిమానమునకు పాత్రుడయ్యెను. అతడు నరసింహశాస్త్రిని పిలిపించి తండ్రి కొడుకుల నిద్దఱను సత్కరించి, ఏబది రూప్యములను వార్షికముగా నిచ్చుచు యాత్రలకు తోడ్పడుదునని అప్పటికి వారిని వెనుకకు పంపెను.

కలువఱాయిలో ఒక నాడు గణపతి ధ్యాన నిమగ్నుడై యుండగా పెద్ద గడ్డముగల యొక పురుషుడు తెల్లనివాడు గోచరించి 'నేను నీకు తపస్సఖుడను, భద్రకుడను; నీవు గణకుడవు' అని ప్రబోదించెను. ఈ విషయమును గణపతి తండ్రికి చెప్పెను. ఆయన తపస్సునకు అనుమతిని ఇచ్చుచు, ఆ సమయమున