పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/24

ఈ పుట ఆమోదించబడ్డది

బంధువుల యొత్తిడి వలన నరసింహశాస్త్రి గణపతికి పండ్రెండవ యేటనే ఎనిమిదేండ్లు నిండని విశాలాక్షి నిచ్చి వివాహ మొనర్చెను. గణపతి భార్య నుద్దేశించి 'మేఘ దూతము' ననుకరించుచు 'భృంగదూత' మును రచించెను. కాని కాళిదాసుని కవిత్వమునకు అది చాల తక్కుగా నున్నదని దానిని చించివేసెను.

పదునెనిమిదవ యేడు వచ్చునప్పటికి గణపతి వ్యాకరణాలంకార శాస్త్రములను సాధించుచు రామాయాణ భారతాది పురాణేతిహాసము లందు పారగు డయ్యెను. పురాణ పఠనము వలన గణపతి తానుకూడ ఋషులవలె తపస్సు చేసి శక్తులను పొంది లోకము నుద్దరింప వలయునని తలంచు చుండెను. తండ్రి వలన పదమూడవ యేటనే అతడు పంచాక్షరి మొదలుగా పండ్రెండు మహామంత్రములను పొందెను. అప్పటి నుండి తపస్సు చేయుటకు తగిన దేశ కాలమును గూర్చి ఆలోచింప జొచ్చెను. కోడలిని కాపురమునకు తెచ్చుటకు తల్లిదండ్రులు యత్నించు చుండగా అతడు ఒక నిబంధనముపై అందులకు అంగీకరించెను. ఆరు మాసములు తాను ఇంటియొద్ద నుండుటకు ఆరు మాసములు తపోయాత్రకు పోవుటకు తన భార్య అంగీకరింపవలయునని అతడు చెప్పెను. విశాలాక్షియు తనకు ఒక రిద్దరు పుత్రులు కలిగిన తరువాత తాను కూడ తపస్సు చేయుటకు భర్త అంగీకరింప వలయునని తెలిపెను. ఇద్దరు సరి వుజ్జీలుగా నున్నారని అందరు సంతోషించిరి. అత్తవారింటికి వచ్చి ఆమె భర్తవద్ద మహాగణపతి మంత్రమును శ్రీవిద్యాదీక్షను గైకొనెను.