పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/23

ఈ పుట ఆమోదించబడ్డది

వలె బాలునకు మాటలు పుష్కలముగా వచ్చెను. అది ఆశ్చర్యకరమై అందరును బాలుడు దైవాంశ సంభూతుడని నమ్మిరి. పిల్లవాడు ఏకసంథాగ్రాహియై పినతండ్రియైన ప్రకాశశాస్త్రియొద్ద కొలది దినములకే బాల రామాయణమును, శివ సహస్రమును కంఠస్థము గావించెను. గణపతి పది యేండ్ల ప్రాయమునకే కావ్యములను పఠించుచు గణిత శాస్త్ర గ్రంథములను కైవసము చేసికొని పంచాంగ గణనమున శుద్ధి ప్రకరణము అనునొక పథకమును రచించి గురువునకు గురు వయ్యెను. సిద్ధ జ్యోతిష్కుడని బాలుని కీర్తి ప్రసరించెను. అప్పుడే ఇతడు ఒక్క గంటలో ముప్పదినాలుగు శ్లోకములతో "పాండవ ధార్తరాష్ట్ర సంభవ" మను ఖండ కావ్యమును రచించెను.

గణపతి తరువాత నరసమాంబకు అన్నపూర్ణ, శివరామ శాస్త్రి కలిగిరి. తరువాత మూడేండ్లకు నరసమాంబ గర్భవతియై ప్రసవించుటకు ముందు 'నాయనా ! ఇప్పుడు పురుడు వచ్చిన వారికి ఎట్లుండును?' అని గణపతి నడిగెను. 'అమ్మా ! ఇప్పుడు పురుడు వచ్చిన వారు మరణింతురు' అని గణపతి నుండి వాక్కు బాణము వలె వెలువడెను. అట్లే ఆమె కవల పిల్లలను ప్రసవించి వారితో స్వర్గస్థురాలయ్యెను. బాలుని వాక్కు అమోఘమై ఆమె మృతికి కారణ మయ్యెనని లోకులు ఘోషించిరి. అది విని గుండె జల్లుమన గణపతి మౌనముద్ర నవలంబించి జడునివలె అయి మరల అందఱకు ఆందోళనము కలిగించెను. రెండు నెలలు అట్లుండి పిదప యథాప్రకారముగా అతడు మేధా విజృంభణముతో కావ్య పాఠములను కొనసాగించెను.