పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/17

ఈ పుట ఆమోదించబడ్డది

పాత్రతను బట్టి పాత్ర, పాత్రను బట్టి పదార్థము. యధాలాపంగా చదివినా, నాయన చరిత్ర పడుకున్నవాడిని కూర్చోబెట్టి ఆలోచింపజేస్తుంది. ఇంతకూ ఈ రాతకు ముగింపులేదు, వుండదు. కానీ ముగించక తప్పదు. సత్యధర్మములు స్థిరములు. అవి భారతమాత పాలిండ్లు. ఆ అమృతమును గ్రోల గలిగినవారు ధన్యులు. కానీ ఆ తల్లి సంస్కారాన్ని, శీలాన్ని సంస్కృతిని మాత్రం నశింప జేయకూడదని ప్రార్థన.

"నాయనే కాదు, ఎందరెందరో కొన్నికోట్ల సంవత్సరాలుగా మన తల్లిని గౌరవిస్తూ, తల్లికి నమస్కరిస్తూ తమ ధర్మాన్ని నెరవేర్చు కుంటున్నారు. వారికి అడ్డు బోకండి. ఒకరికి ఉపకారం చేయక పోయినా అపకారం చేయకుమనే సామెతనైనా గుర్తుంచుకోండి.

లేకుంటే తల్లిని తాకట్టు పెట్టే దౌర్బాగ్యులై, చివరకు అనాథలై దిక్కు తోచక దిక్కు కొకరుగా పరుగెడుతూ అలమటించాల్సిన దుర్గతి పట్టగలదని ఆర్యులు ఏనాడో హెచ్చరించారు. అలా జరిగిననాడు ఎవరికెవరు ? రక్షణ ?

వేద ధర్మములు, సంస్కారములు, సంస్కృతి, సాంప్రదాయములకు, ఆచార వ్యవహారములకు వివరణలను కొంతవరకు తెలుసుకోగోరితే భగవాన్, నాయన, సాయి, వగైరా......... పరమాత్మ స్వరూపుల చరిత్రలు చదవండి. రామాయాణ, భారత, భాగవత, భగవతాది ధర్మసూక్ష్మములను తెలిపే పురాణములను చదవండి. మేల్కొండి అని ఘోషిస్తున్నాయి - సత్యాన్వేషణ తత్పరుల ఆవేదనలు. ఈ ఆవేదనల రోదనలెందుకని తామసులై వుందామో ! లేక తాపసుల మౌదామో ! అటు యిటుగాక మధ్యన యిరుక్కు పోతామో ? వారివారి ప్రారబ్దము శ్రీ గురుకృప దైవేచ్ఛ! లోకాస్సమస్తాస్సుఖినోభవంతు.

ఓం తత్ సత్ !!