పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/135

ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ సోమయాజుల సూర్యనారాయణగారు తెలిపిన యొక వృత్తాంతమున నాయనకు గల యతీంద్రియ శక్తులెట్టివో వ్యక్తమగుచున్నది. "ఎండలు చాలా తీవ్రముగా ఉన్నవి. ఒకరోజు సాయంత్రము నేను నా అలవాటు చొప్పున ఆశ్రమమునకు వచ్చినాను. నాయనగారు ఖిన్నులై విచారముగా నున్నారు. నేను భయపడి కారణమడుగగా, ఆశ్రమములో సదుపాయము లన్నియు సరిగానే ఉన్నవి. కాని ఈ రోజున అబిసీనియా చక్రవర్తి హెవీస లాపిన్ రాజ్యభ్రష్ఠుడై భార్యాబిడ్డలతో బ్రిటీషువారు "అసైలము" (Asylum రక్షణస్థానము) ఇవ్వగా పోవుచున్నారు. ఆ దృశ్యము కనపడగా విచారము వచ్చినది. కాని బ్రిటీషువారే వీనికి 5 సంవత్సరముల తరువాత తిరిగి రాజ్యము ఇప్పించుతారు. అందుచే విచారము తగ్గినది అనెను" అలాగే జరిగినది.

వీరు తెలిపిన మరియొక వృత్తాంతము వలన నాయనకు లౌకికవిధి నిర్వహణమున ఎంత శ్రద్ద యుండినదో వ్యక్తమగు చున్నది. "ఒక రోజున నేను సాయంకాలము ఆశ్రమానికి వచ్చి ఇవతల వరండాలో కూర్చుని సంధ్యావందనము చేసికొనుచుండగా వచ్చి చూచి సంధ్యావందనము అయిపోయింతర్వాత "నీవు ఆఫీసులో పనిపాటలు సరిగా చేసిన తర్వాత సంధ్యజపము చేస్తే మంచిదే కాని ఆఫీసులో పనిపాటలు సరిగా చేయకుండా ఇంటికి వచ్చి జపముచేస్తే లాభములేదు. ఆఫీసులో పనులు మైమరచినట్లు చేయాలి. అలాగు చేయనిచో భగవంతుడు నిన్ను క్షమించడు."*[1]

  1. * జయంతి సంచిక - " నాయనగారితో నా పరిచయము" - సోమయాజుల సూర్యనారాయణ - పుట 33