15. ఉపసంహారము
1935 ఆగష్టు మూడవ వారములో నాయన ఖడ్గపురమునకు పోయి ఆచాళ్ల పార్వతీశము యొక్క యింటిలో బస చేసెను. ఈ సమయముననే ఒకనాడు నాయన కంచి కామకోటి పీఠాధిపతులైన చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారిని దర్శించుట సంభవించెను. గోపాలశాస్త్రి (గోపదేవ్) అను యోగివలన ఈ సన్నివేశము ఏర్పడెను. గోపాలశాస్త్రి నైష్ఠిక బ్రహ్మచారి. ఖడ్గపురమునకు స్వామివారు వచ్చినప్పుడు ఇతడు స్వామివారిని దర్శించుచుండెను. ఇతడు నాయనను గూర్చి అంతకు పూర్వమే వినియుండెను. కాని, చూచి యుండలేదు. పండితు లెందఱో స్వామివారి దర్శనమునకు వచ్చు చుండగా నాయన రాలేదమని సందేహము కలిగి ఇతడు స్వామి వారినే అడిగెను. " వారు నిరపేక్షులు. అందువలన రాకయుందురు. అదియునుగాక వారు సంస్కరణ శీలురు. అందువలన రాక యుండవచ్చు" నని స్వామి, వారు వచ్చినచో తమకు అభ్యంతరము లేదనికూడ తెలిపిరి. గోపదేవుడు నాయనయొక్క నివాస స్థానమును తెలిసికొనిపోయి ఆయనను దర్శించెను.
నాయనయొక్క రూపము గోపదేవుని మిగుల నాకర్షించెను. ఈ సందర్భమున గుంటూరు లక్ష్మీకాంతము చిత్రించిన నాయన రూపమును గ్రహించుట సమంజసము. "ఇదున్నర అడుగుల యెత్తుగలిగి బక్క పలుచగా నున్నను, బంగారు బొమ్మవలెనున్న ఈ మానవాకృతి యెట్టివారి దృష్టినైన నరికట్టి యాకర్షించెడిది. విశాలమైన ఫాలము, బట్టతల, పూర్ణవికాసమును స్ఫురింపజేయు తీరుగల శిరస్సు, విజ్ఞాన దృక్కులను ప్రసరించు నేత్రములు,