పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/118

ఈ పుట ఆమోదించబడ్డది

గ్రహింప వలసి యున్నది. ఆయనయందు సకల కామములు ఉపశాంతి పొందినను ఒక్క కామ్యము మాత్రము ప్రబలముగా మిగిలియుండెనని "దానిని నిషేధించుటకు శక్తిలేదు, దూరముగా పొమ్మనుటకు ఇచ్చ లేదు" అని నాయన మే 5వ తేది లేఖలో తన నిస్సహాయస్థితిని, నిర్వేదమును స్పష్టమొనరించెను. ఇంద్రుని ఉపాసించి శక్తిని పొంది భారత భూమియొక్క దుర్గతిని ఎట్లయినను తొలగింపవలయు నను కాంక్షయే ఆ ప్రబలమైన కామ్యమని 22-7-31 తేది వ్రాసిన లేఖలో స్పష్టమగుచున్నది. కుండలినీ శక్తియొక్క ఉల్లాసమును పరీక్షించినను "అహం' యొక్క జన్మస్థలమును పరీక్షించుచు ఎంత తీవ్రముగ తపస్సు చేసినను నాయన ఆ కామ్యమును తొలగించుకొనలేక తృప్తిని పొందలేక భక్తినే ఆశ్రయింపవలసి వచ్చెను. ఆ భక్తికికూడ గురువు, ఇంద్రుడు, భారతభూమి లక్ష్యములగుట గమనింపదగియున్నది. దీనినిబట్టి సంకల్పరహితమైన ఆత్మనిష్ఠను సాధించుట చాలా దుర్ఘటమని, సర్వసంకల్ప పరిత్యాగమే సంతృప్తిని సంతుష్ఠిని, ఆనందమును కలిగింపగలదని గ్రహింపవలసియున్నది. యీ అభిప్రాయమును ఆయనయే 10-3-31 తేది వ్రాసిన లేఖలో ఇట్లు స్పష్టమొనరించినాడు. "ప్రభో! భగవంతుని కటాక్షమువలన నాకు ఏ నిష్ఠ ప్రాప్తించెనో, అది నాకిక్కడ విజ్ఞానాత్మక మగుచున్నది. శరీరముకంటె భిన్నముగా ఆత్మను ఈ గుహయందు అనుభవించు చుంటిని. అట్లయినను ప్రపంచానుభవమునుండి యిది భిన్నత్వము బొందనందున పూర్ణనిష్ఠ గాదని తలంచుచుంటిని. అట్టి పూర్ణ నిష్ఠకై బహుయోజనములు లంఘించగల్గు తమ కటాక్షమును బంప వేడుచుంటిని."