పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/113

ఈ పుట ఆమోదించబడ్డది

కుమారుని ఆనందమున, వైద్యుని ఆశ్చర్యమున ముంచెను. పిదప నాయన కుమారుని కలువఱాయికి చేర్చి కుళువేకు తిరిగి వచ్చుచు త్రోవలో రమణ భగవానుని దర్శనము గావించు కొనెను.

1929 మే నుండి 1931 ఫిబ్రవరి వరకు నాయన కుళువేలో నిశ్చల తపస్సులో గడిపెను. సుందర పండితుడు, అతని తండ్రి పుండరీక రాయుడు అను వారు నాయనకు ఆప్తులై ఆయనను శిరసిలో తమ యానందాశ్రమములో నుండుడని ఆహ్వానించిరి. వాసిష్ఠుడు యాశ్రమమునకు చేరి పెక్కు మందికి మంత్రదీక్షల నొసంగుచు మహర్షిని గూర్చి ప్రసంగించుచు నుండెను.

కపాల భేద సిద్దితోపాటు వాసిష్ఠునకు అంతరంగమున ఒక దివ్య శరీరము పుట్టి ఆయనకు తెలియకుండగనే ఇతరులను ఆవహించుచున్నట్లు తోప జొచ్చెను. దానిని ఆయన స్వాధీన మొనర్చుకొనుటకు ప్రయత్నించుచుండెను. రామచంద్రభట్టు అను శిష్యుడు సంస్కృతమునే ఎఱుగని వాడు. నాయనయొక్క ప్రసంగములను శ్రద్దతో వినుచు ఇతరుల పరిహాసములకు లోనగు చుండెను. అట్టివాడు అల్పకాలముననే సంస్కృతమున ప్రజ్ఞను పొంది అందఱకును ఆశ్చర్యమును కలిగించెను. ఇది ఆ దివ్య శరీరముయొక్క మహిమయేయని వాసిష్ఠుడు గుర్తించెను.

శిరసిలోని యానందాశ్రమము నుండి నాయన భగవానునకు చాల ఉత్తరములు వ్రాసెను. వానిలో నాయనయందు కలిగిన పరిణామము చక్కగా వ్యక్తమగుచున్నది. 17-3-1931 తేది నాయన ఇట్లు వ్రాసెను.