పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/62

ఈ పుట ఆమోదించబడ్డది

52

దంపూరు నరసయ్య


ఏంచేశాడో తెలుసా? డివిజనల్ మేజిస్ట్రేటు (Divisional Magistrate) ఆర్డరుకోసం నా లేఖలోని విషయాలను నివేదించాడు. ఆ డివిజనల్ మేజిస్ట్రేటు చేసిన తీర్మానం ఏమిటనుకొన్నారు? నేను నివసిస్తున్న ఇంటికన్నా, ఇంకాస్త సౌకర్యంగా ఉండే ఇంటికి మారమని సలహా ఇచ్చాడు. ఆ పనేదో నేను చేయలేనట్లు! గ్రామీణప్రాంతాలలో పౌరస్పందన ఈ విధంగా కాపాడబడుతూ ఉంది. ప్రజల అసౌకర్యాన్ని నివారించమని నేను కోరాను. మేజిస్ట్రేటు 'మహా తెలివిగా' మమ్మల్ని మాట్లాడవద్దని చెప్పాడు.

ఈ విశ్వాసపాత్రుడు, D..

నరసయ్య మేజిస్ట్రేటుకు రాసిన జాబు కాపీని తన సంపాదకీయ లేఖతోపాటు జతచేసి మెయిల్ పత్రికకు పంపాడు. ఆయన మేజిస్ట్రేటుకు ఉత్తరం ఏ సందర్భంలో రాశాడో వివరిస్తాను. ఒంగోలులో నరసయ్య కాపురంఉన్న ఇంటిపొరుగున ఒక 'కోమటి' వేపనూనె తీసేవాడు. ఇందుకోసం విధివిరామం లేకుండా, రాత్రి పగలు అనే భేదం లేకుండా రోళ్ళలో వేప విత్తనాలు పోసి దంచుతూ ఉంటారు. ఆ విధంగా దంచగా వచ్చిన పిండి ముద్దను ఉడికించి, వేపనూనె తీస్తారు. నూనె వండిన తర్వాత మిగిలిన వ్యర్థ పదార్థాన్ని ఇంధనంగా వాడుతారు. దీనివల్ల గాలి కంపు కొడుతుంది. వాతావరణం దుర్భరంగా తయారవుతుంది. జనసమ్మర్దమైన నివాస ప్రాంతాలలో వేపనూనెతీసే కార్యక్రమం కొనసాగించడంవల్ల ప్రజల ఆరోగ్యానికి చేటు కలిగే పరిస్థితి ఏర్పడుతుంది.

దుర్భరమైన ఈ పరిస్థితి నుంచి విముక్తి కోరుతూ నరసయ్య పోలీసు రిపోర్టు ఇస్తాడు. పోలీసులు విచారించి, నరసయ్య రిపోర్టు చేసిన విధంగానే పరిస్థితి ఉందని 'అక్కరెన్సు' (occurrence) రిపోర్టు మేజిస్ట్రేటుకు పంపుతారు. ఆ రిపోర్టును మేజిస్ట్రేటు 'బుట్ట దాఖలు' చేస్తాడు. పోలీసులు పంపిన రిపోర్టు మీద చర్య తీసుకోబడలేదని గ్రహించిన నరసయ్య మేజిస్ట్రేటుకు ఉత్తరం రాస్తాడు. “పోలీసులు పంపిన రిపోర్టు మీద చర్య తీసుకోలేదని విని ఆశ్చర్యపోయాను. అన్నిరకాల 'న్యూసెన్స్‌లను' నిర్మూలించడంలో మీరు అసాధారణమైన చొరవ చూపుతున్నారని విన్నప్పుడు నా ఆనందానికి, ఆశ్చర్యానికి హద్దు లేకుండా పోయింది” అని మేజిస్ట్రేటుకు రాసిన ఉత్తరంలో అంటాడు. పీనల్‌కోడ్ (Penal Code) 278 సెక్షన్ కింద ఈ న్యూసెన్సు శిక్షార్హమైనదని పేర్కొంటూ, తన వాదనకు బలాన్నిచ్చే ఒక సంఘటన వివరిస్తాడు.

మద్రాసు సముద్రతీరంలో మునిగిపోయిన నౌకలోని బియ్యం తడిసిపోతుంది. ఈ సంఘటన సీనియర్ మేజిస్ట్రేటు దృష్టికి వెళ్తుంది. ఆయన తడిసిన బియ్యాన్ని సముద్రంలో కుమ్మరించమని ఆజ్ఞాపిస్తాడు. నౌక యజమానికి పెద్ద మొత్తం నష్టం కలిగినా నౌకను మందుగుండుతో పేల్చివేస్తారు. ప్రజాహితాన్ని దృష్టిలో ఉంచుకొని చేసిన పని ఇది. ప్రజారోగ్యానికి నష్టం వాటిల్లే అసహ్యకర పరిస్థితి ఏర్పడితే, దయ, జాలి వంటి