పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/102

ఈ పుట ఆమోదించబడ్డది

92

దంపూరు నరసయ్య


మేము ఇటువంటి వ్యాఖ్యలు చేయవలసి వస్తూంది. ఈ పత్రికా సంపాదకుడు “మలబారు మాన్యువలు” కోసం అభ్యర్ధన పంపుకొన్నాడు. “ఆ కాపీ ఉచితంగా ఇవ్వలేము” అని అభ్యర్థనను తిరస్కరిస్తూ ప్రభుత్వ అండర్ సెక్రెటరీ (Under Secretary) ఆర్. డబ్ల్యు , బెన్‌సన్ (R.W. Benson) చేవ్రాలుతో జీ.ఓ జారీ చేశారు. అదే నెలలో మరలా "కర్నూలు జిల్లా మాన్యువలు” కోసం విజ్ఞప్తి పంపుకొన్నాము. సెక్రెటరీ జె. ఫ్రెడరిక్ ప్రైస్ (J.Frederick Price) ఫేసిమిలి (Facsimile) స్టాంపుతో జి.ఓ. మాకు అందింది. ఈ నెలలో విద్యాపరిపాలన నివేదిక కోసం అడిగాము. “ప్రభుత్వ ముద్రణాలయం సూపర్నెంటు వద్దకు డబ్బు తీసుకొని వెళ్ళండి” అని అండర్ సెక్రెటరీ ఏ.సి. కార్డ్యూ (A.C. Cardew) సమాధానం రాశాడు.

ఇట్లా నిరాకరించడం నిలకడలేని విధానం. ద్వేషపూరితమైన చర్య. ఈ పరగణాను పాలించే ప్రభుత్వంమీద విశ్వాసం పొగొట్టే చర్య. ఈ జి.ఓలలో వ్యక్తమవుతున్న అల్పత్వం ప్రభుత్వ గౌరవాన్ని దిగజారుస్తుందని మేము కుండబద్దలు కొట్టినట్లు చెప్పక తప్పడం లేదు. మెసర్స్ ప్రైస్, బెన్సన్, కార్డ్యూ అండ్‌కో వారు డబ్బు ఆదా చేయడానికి ఇటువంటి చర్యలు చేపడుతున్నట్లయితే ఈ నివేదికలను కొన్ని పత్రికలకు ఉచితంగా ఎందుకు ఇస్తున్నట్లు? ఈ ఉపకారం పీపుల్స్ ఫ్రెండ్‌కు దక్కకుండా పక్షపాత వైఖరి ఎందుకు ప్రదర్శిస్తున్నారు? సెక్రెటేరియట్‌కు ప్రభుత్వ పత్రాలను పత్రికల వారికి పంపిణీ చేసే విధానమంటూ ఏదీ లేదు. సెక్రెటేరియట్‌లోని అధికార త్రయం చిత్తంవచ్చినట్లు ఆజ్ఞలు జారీచెయ్యకుండా విచక్షణతో పరిశీలిస్తే, విద్యా వివేకం లేని ఒక చిరుద్యోగి తమను ఎటువంటి అసందర్భస్థితికి నెట్టాడో గమనించ గలుగుతారు. మా సోదర పత్రికలకు ఉచితంగా పంపిణీ చేసిన సంపుటాలనే మమ్మల్ని డబ్బు చెల్లించి తీసుకోమని ఆర్డరు వెయ్యడాన్ని మేము ఆక్షేపిస్తున్నాము.

ఈ సంద్భరంలో కాస్తంత స్వోత్కర్ష కలగలిసిన నమ్మకంతో ఈ మాటలు చెపుతున్నాము. ప్రజల దృష్టిలో మాకొక స్థానం ఉంది. అందుకు మేము గర్విస్తున్నాము. పత్రికా లోకంలో మా ప్రజ్ఞనుబట్టి మేము బృహస్పతులమనో, శుక్రాచార్యులమనో చెప్పుకోడంలేదు. పత్రికా గగనంలో మా స్థానం ఎంత చిన్నదైనాకావచ్చు. మా విశ్వాసాలకు అనుగుణంగా మేము నడుచుకొంటాము. ప్రయోజనం అనే వెలుగును మా చుట్టూ వెదజల్లుతాము. ప్రజా సంబంధమైన ప్రభుత్వ చర్యలను మా పత్రిక న్యాయంగానే విమర్శిస్తూ వచ్చింది. ఈ ధర్మం నిర్వర్తించడం కోసం స్థానిక పత్రికలకు కల్పించిన సౌకర్యాలనే మేము కోరాము. ప్రభుత్వం మా సోదర పత్రికా రచయితల విషయంలో ప్రవర్తించిన నాగరిక పద్ధతిలో పీపుల్స్ ఫ్రెండ్‌తో వ్యవహరించలేదని ఎక్కువగానే చెప్పాము. ఈ విమర్శ లార్డు కనమరా దృష్టికి వస్తుందని, గౌరవనీయులైన కనమరా