ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర క ర ణ ము 2

7

ఉత్తరహిందూస్థానమందలి జనులందఱు నాబూగిరిని దివ్యక్షేత్రముగాఁ బరిగణింతురు. దానియందుఁ బెక్కులు దేవాలయములు కట్టబడినవి. వానిలోనెల్ల నచలేశ్వరాలయము మిగుల గొప్పది. ఆయాలయము చిరకాలముక్రిందటనే కట్టఁబడినను నూతనముగా నిర్మింపఁబడినట్లు ధవళకాంతుల నీనుచు శిల్పచాతుర్యముచే వింతగొలుపుచుఁ, జూపఱకు దేవతానిర్మిత మేమో యనుసందియముఁ గల్గింపకపోదు. అందలి యీశ్వరుని మునికులపతియగు వసిష్ణుండు ప్రతిష్ఠించెననియు, నా దేవుఁ డెక్కుడు మహత్త్వముగలవాఁ డనియుఁ బెద్దలు చెప్పుదురు.

అచలేశ్వరాలయమునకుఁ దూర్పున నొకకుండము కలదు. అది తొమ్మిదివందలయడుగుల నిడివియు నిన్నూటనలువది యడుగుల వెడల్పును గల్లి సర్వదా జలపూర్ణమై యుండును. పూర్వము మహిషాసురునిచేఁ బీడితులై దేవతలు మిగుల భీతులై యాపర్వతముమీఁదికి వచ్చి యట గోళ్ళతోఁ ద్రవ్వి మఱుఁగు గావించుకొని దాఁగియుండిరఁట. నఖములచేఁ దవ్వబడుటవలన నాజలకుండమునకు 'నఖి' యను పేరు వచ్చెను. దానినడుమభాగమునఁ జిన్నద్వీపము వంటి బండఱాయి యొకటి కలదు. దానిపై జగన్మాత యగు భవానీదేవియాలయము పూర్వకాలమున నుండెడిదఁట. కాని, యిప్పు డది పాడుపడి శిథిలము లగుగోడలు మాత్రము