ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xv

రార్ధము బసవఁడు నిర్దేశించి యుంచెను. అతఁ డాపనిచేసి, బాసను కాపాడుకొనెను. శాపానుగ్రహశక్తి యుక్తుఁడును, ప్రాణ ప్రదానోపసంహరణ సమర్ధుఁడు నైన బసవఁడే బిజ్జలునిఁ జంపి వీరశైవ ధర్మమును గాపాడుకొని యుండవచ్చును కదా ! సోముఁ డట్లేల కల్పింపలేదు ? సమాధానముగా చరిత్ర అడ్డము వచ్చెనని యైనను చెప్పవలెను. లేక బసవని యుదాత్త చరిత్రము నౌచిత్య సంభరితము చేయ నెంచె నని సమాధాన పడవలెను. లేనిచో కథ నిట్లు మార్చుటలో జైన పురాణ ప్రభావ మున్న దని యూహింపవలెను, మునిసువ్రతుఁ డను నిరువదియవ జైనతీర్థంకరుని చరిత్రమున బలదేవుఁ డగు రామచంద్రుఁడును, వాసుదేవుఁ డగు లక్ష్మణుఁడు నన్నదమ్ము లైనట్లును, ప్రతి వాసుదేవుఁడు రావణుఁ డైనట్లును జెప్పఁబడి యున్నను, రామచంద్రుఁడాసన్నభవ్యుఁ డగుటచే రావణసంహారము చేయ నొల్లక దూరభవ్యుఁడైన లక్ష్మణునిచే తత్సంహారము నిర్వహింపఁ జేసె ననియు గల్పింపఁ బడినది. జైనులలో దూరభప్యుల కంటె నాసన్నభవ్యులు కర్మ బంధవిముక్తి నధికముగా సాధించి మోక్షసిద్ధి కతి సన్నిహితు లై యున్నవారుగాఁ బరిగణింపఁబడుదురు. కావున నట్టివారి కెట్టి హింసాకాండ నంటకట్టరు. ఇట్టి జైన పురాణ కథావిధాన సంస్కారమును సోమన గ్రహించి లింగైక్యమందఁబోవు చున్న బసవనిచే బిజ్జలుని సంహారము గావింపఁ జేయక, వైదిక కర్మాసక్తికలిగియు బసవని పూజించిన జగదేవ దండనాయకుని ద్వారమున దానిని నిర్వహింపఁజేసి బసవని విశుద్ధసాత్త్వికశీలసంపదను పరిపోషించే ననుటకు వీలున్నది.

కర్ణాటాంధ్రములయందు [1] జైనపురాణములు వైదికపురాణముల కెదురు నిలిచి ప్రజాదరణ పొందుటకు యత్నించినవి. కన్నడమున కొంతకాల మాపురాణములు ప్రజలహృదయసీమలపై రాజ్యము చేసినవి. వానికి పోటీపడి జనాదరణము నొందుటకై వీరశైవులు ప్రథమపురాణ నిర్మాణయత్నము గావించిరి. సోమనాథునిపై నాభార ముంచిరి, అతఁడు జైనపురాణ నిర్మాణములోని లోగుట్టులు తెలిసి

  1. చూడు : ఆంధ్రకర్ణాట సారస్వతములు పరస్పర ప్రభావము - శ్రీ నిడుదవోలు వేంకటరావు గారు, అధ్యా: తెలుఁగు వాఙ్మయము, నన్నయపూర్వయుగము. ఇందు శ్రీ వేంకటరావుగారు పద్మకవి జినేంద్రపురాణము, (క్రీ. శ. 941) సర్వదేవుని ఆదిపురాణము (క్రీ. శ. 953) మొ|| జైనపురాణములు నన్నయకుఁ బూర్వమే వెలసిన యాంధ్రానువాదము లని పేర్కొనినారు. పద్మకవియే పంపకవి యనియు, సర్వదేవుఁడే పొన్నకవి యనియు నిరూపించినారు. (కాని వారు జైన పురాణ రచనాప్రభావము బసవపురాణముపైఁ గలదని గుర్తింపలేదు.)