ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

111

ననుచు నొక్కెడఁ బొంచికొనియుండ గజము
సనుదెంచి కోపించుచందంబు సూచి 940
యంతరాంతర మించు కైనఁ దలంప
కంతఁ [1] బరిచ్చేది యై యుపాయమున
దుండాగ్రమునఁ జొచ్చి తొలుచుచుఁ జెలఁది
దండిమదేభంబు తలకెక్కి చంపెఁ."
గాన యిక్కడ నమార్గము నేయుధీర
మానసుఁ డెంతవాఁ డైనఁ గానిమ్ము :
అట్లు నేఁడును వాఁడు నరుదెంచెనేని
యెట్లైనఁ జంపకఁ యేఁ బోవ" ననుచు
వెనుకదిక్కునఁ బొంచికొని సమీపమునఁ
దనపొడసూపక తపసి యొన్నెడను- 950
గన్నప్పదేవుని ఘనముగ్ధతయును
సన్నుత భక్తియు సంస్పృహత్వంబుఁ
దపిసికిఁ జూపఁగఁ దలఁచి శంకరుఁడు
విపరీతగతిఁ ద్రినేత్రపరీత మైన
వదనంబు ధరియించి వలపలికంట
నుదకంబు గాఱంగ నున్నయత్తఱిని
అరుదొందఁ దొల్లిటయట్ల కన్నప్పఁ
డరుదెంచి యరుదెంచి హరుకంటినీరు
పొడఁగని, బిట్టుల్కిపడి. భయభ్రాంతిఁ
దొడరుచు నరుదారఁ దొల్లింటిపూజ 960
గ్రక్కునఁ దనచెప్పుఁగాలఁ బోనూకి,
పుక్కిటి నీరును బుగులున నుమిసి.
తలవంచి పత్తిరి డులిచి, మాంసంబుఁ
దలరుచు నర్పించి, తదవసరమున
నానేత్రజలపరిహారార్థముగను
దా నీశ్వరునకు నంతర్థార యెత్తు

  1. చంపునది.