ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

51

“సకలలోకైకరక్షకుఁ డగుశివున
కొక నిన్ను రక్షించుటకు నెంతపెద్ద ? 110
కావున మాలింగదేవుభక్తులకు
నేవేళ వెఱచుండు మింతియె చాలు ;
నీరాజ్య మేలించు టీది యెంత పెద్ద
నీరధి మేరగా నిన్ను నేలింతు."
నని యూఱడిల బసవనదండనాథుఁ
డనుకూలుఁ డై పల్క నంత బిజ్జలుఁడు
మఱియుఁ గట్టఁగ నిచ్చి మాహనీయలీలఁ
గొఱలునెయ్యమున వీడ్కొలిపె ; వీడ్కొలుపఁ
గా బసవఁడు భక్తగణములుఁ దాను
నాబల దేవనాయకుని నగళ్లు 120
తనకు నిజాలయస్థాన మై యుండఁ
దననియోగము గొల్వఁ దాఁ జనుదెంచి,
లాలితలింగకేళీలసన్మతిని
లీలానుకూల సచ్ఛీలసంపదల
ననుదినవర్ధమానైశ్వర్యుఁ డగుచు
జనపతి రాజ్యంబుఁ జక్క పెట్టుచును
దెసలెల్ల సత్కీర్తిఁ బసరింపుచున్న
బసవనిపూనిక బాస యె ట్లన్న:

—: బసవేశ్వరుని బాస :—


శివరాత్రి నిత్యంబు చెల్లించుబాస,
శివభక్తు లెల్లను శివుఁ డనుబాస , 130
భక్తుల యెగ్గులు పట్టనిబాస,
భక్తులకుల మెత్తిపలుకనిబాస,
మృడు నైన నొకమఱి యడుగనిబాస.
యడిగిన యర్థంబు గడపనిబాస,
చీమంతయైన వంచింపనిబాస,
యేమి వేఁడిన నడుగిడ కిచ్చుబాస.