ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మధురకాండము

59

శ్రీకృష్ణుఁడు ముచికుందునకుఁ దన వృత్తాంతము నెఱుఁగఁ జెప్పుట


“వసుదేవతనయుఁడ, వాసుదేవుఁడను
ససమసాహసుఁ గంసు నవలీలఁ జంపి
మసలక రాక్షసమథనంబు సేసి
మధురాపురంబు నెమ్మది నేలుచుండ
నధికసత్వుఁడు కాలయవనుఁ డేతెంచి
నలిమీరి మాపట్టణము నిరోధింప
నెలయించి యాతని నిటు తోడి తేర
నీకోపశిఖిచేత నీరయ్యె నాతఁ
డేకతం బీగుహ నేల యున్నాఁడ?640
వాదిరాజులకంటె నధికుండ వైతి
మేదినీశ్వర! నిన్ను మెచ్చితి వరము
పోఁడిగా నిచ్చెదఁ బొరి నేదియైన
వేఁడుము నీ" వన్న వినతుఁడై పలికె.
“దివ్య తేజోమయ! దేవేంద్రవంద్య!
అవ్యయాత్మజ! కృష్ణ! అంభోజనయన!
భక్తపరాధీన! భక్తలోకేశ!
భక్తప్రజత్రాణ! పరమకల్యాణ!
రాజ్యంబు సేసి యా రాజులలోన
పూజ్యుఁడవైమని పుత్రులఁ గంటి
ధనదాన్యవస్తుసంతతియందు నాకు
మనమురోయుట సేసి మదికోర్కెలుడిగె
నేకర్మములు మాని యీగుహాంతమున
నేకచిత్తుండనై యిట నిద్రవోవ