ఈ పుట ఆమోదించబడ్డది

గరుడాళ్వార్ల అనుగ్రహమును పొందిరి. అంతేకాక వారి వలన హయగ్రీవ మంత్రము నుపదేశము పొంది దానిని అచటనే జపించి హయ వదనుని అనుగ్రహమును సంపాదించిరి. కావుననే గరుడాళ్వార్లను స్తుతించుచు గరుడ పంచాశత్, హయగ్రీవ స్తోత్రరూపముగా హయగ్రీవస్తోత్రమును అనుగ్రహించిరి. అంతేకాక కాంచీపుర ప్రాంత దివ్యదేశమూర్తుల విషయములో అనేక స్తోత్రములను రచించిరి.

ఒకానొకప్పుడు శ్రీరంగమున మతాంతరుల ఆగడములు మితిమీరినప్పుడు వీరు శ్రీరంగము వేంచేసి మతాంతరులను వాదమున జయించి విశిష్టాద్వైత సిద్దాంతమును స్థాపించిరి. ఆ సందర్బములో జరిగిన వాద సారాంశమునే శతదూషిణిగా రచించిరి. వీరి విషయమున ప్రసన్నుడైన శ్రీరంగనాథులు వేదాన్తా చార్యులనియు, సర్వతస్త్ర స్వతంత్రులనియు, కవితార్కిక సింహులనియు బిరుదములను కృపచేసిరి. "త్రింశద్ద్వారం శ్రావిత శారీరక బాష్య:" అని వారు ముప్పదిసార్లు శ్రీభాష్య ప్రవచనము చేయుటయే కాక శ్రీభాష్య సారార్థమైన అధికరణ సారావళిని రచించి వేదాన్తాచార్యులను బిరుదమును సార్థకమొనర్చుకొనిరి. శ్రీరంగనాథుల పాదుకా విషయమైన "పాదుకా సహస్రము"ను రచించి శ్రీరంగనాథుని అనుగ్రహమును పొందిరి.

వీరు రచించిన గ్రంథములు శతాధికములు. వ్యాఖ్యాన గ్రంథములు, స్తోత్ర గ్రంథములు, ద్రవిడ ప్రబంధములు, వ్యాఖ్యానములు, సంస్కృత కావ్యములు, నాటకములు అనేకములు రచించిరి. వానిలో శతమాషణి, న్యాయ సిద్ధాంజనము, గీతాభాష్య తాత్పర్యచంద్రిక, న్యాయపరిశుద్ది, పాదుకా సహస్రము, యాదవాభ్యుదయము, హంస సందేశము, సంకల్ప సూర్యోదయము, రహస్యత్రయసారము ప్రసిద్ధములైనవి. వీరి శ్రీపాదములను ఆశ్రయించిన వారిలో వీరి కుమారులు వరదాచార్యులు, బ్రహ్మతంత్ర స్వతంత్ర జీయరులు ప్రముఖులు. ఒక సమయమును విద్యారణ్యస్వామికిని అక్ష్యోభ్యమునికిలి ఏర్పడిన వాదములో మాధ్యస్థము వహించిరి.

వీరు రచించిన గ్రంథముల వివరములు: స్తోత్ర గ్రంథములు 29. కావ్యనాటకములు 5. వేదాన్త గ్రంథములు 21. అనుష్ఠాన గ్రంథములు 2. రహస్య గ్రంథములు 30. ద్రావిడ ప్రబంధములు 25.

ఏమైనను "యతి ప్రవర భారతీ రసభరేణ నీతం వయ:" అనియు "నిర్విష్టం యతి సార్వభౌమ చచసా మా వృత్తిబి ర్యవ్వనమ్" అనియు తామే చెప్పుకొనినట్లు భగవద్రామానుజుల శ్రీసూక్తులతోడనే కాలక్షేపము చేసిన మహనీయులు వేదాన్త దేశికులు.

237