ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీమణవాళమామునులు

(సుందరజామాత్రమునులు)

తిరునక్షత్ర తనియన్:-
    తులాయామతులే మూలే పాండ్యే కుంతీ పురీవరే
    శ్రీ శేషాం శోద్భవం వందే రమ్యజామాతరం మునిమ్||
నిత్య తనియన్:-
    శ్రీశైలేశ దయాపాత్రం ధిభక్త్యాది గుణార్లవమ్‌|
    యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిమ్||

వీరు సాదారణ నామ సంవత్సర తులా మాసమున మూలా నక్షత్రమున గోమఠం తిరునావీరుడయపిరాన్ తాతరణ్ణర్ అనువారికి కుమారులుగా నవతరించిరి. తల్లిగారు శ్రీరంగనాచ్చియార్. సోదరులు తిరుమలై ఆళ్వార్, సోదరి నాచ్చియారమ్మన్. పూర్వాశ్రమమున కుమారులు శ్రీరామానుజాచార్యులు. వీరికి తండ్రిగారు జాతకర్మాది సంస్కారములు చేసి "అழగియమణవాళన్" అనిపేరుపెట్టిరి. వీరును తమ మేనమామగారి గ్రామమగు "శిక్కల్ కిడారం" అను అగ్రహారమున బాల్యమును గడిపిరి.

"పిన్నానార్ వణజ్గుం శోది" (వెనుకటివారు ఆశ్రయించి తరించుటకు తగిన తేజోమూర్తి) అనునట్లు సంసారి చేతనులను ఉజ్జీవింపచేయుటకై భగవద్రామానుజులే తిరిగి మణవాళమామునులుగా అవతరించిరి. ఆళ్వారాచార్యుల శ్రీసూక్తులే దారకముగా గల మణవాళమామునుల దివ్యచరిత్ర భగవద్రామానుజుల చరిత్ర కంటె విస్తృతమైనది.

భగవద్రామానుజులవలె వీరును దివ్యదేశయాత్రచేయుచు అనేక దివ్యదేశములను జీర్ణోద్దరణ గావించిరి. పరమత నిరసనమొనర్చి స్వమత స్థాపన చేసిరి. వడమధురై (ఉత్తరమధుర) వేంచేసి జీర్ణోద్దారణగావించిరి. ఆళ్వార్ తిరునగరి యందు తిరువాయిమొழி పిళ్లై గారికి తమ స్వస్వరూపమగు ఆదిశేషావతారము ప్రదర్శించిరి. తిర్యక్‌స్థావర జంగమములకు సైతము మోక్షముననుగ్రహించిన దయా సముద్రులు వీరు.

శ్రీరంగమును నిత్యవాసముగా చేసికొని యుండుటయేగాక శ్రీరంగనాథులకు ఈడు వ్యాఖ్యానమును ప్రసాదించిరి. నంబెరుమాళ్లును పరమప్రీతితో "శ్రీశైలే దయాపాత్రం" అను శ్లోకమును కృపజేసి పెరియజీయర్ అనుతిరునామముంచిరి. తదాదిగా వీరికి కోయిల్ పెరియ జీయర్ అనుతిరునామమేర్పడినది.

233