ఈ పుట ఆమోదించబడ్డది

తిరుచానూర్‌లోని శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయము తప్పక సేవింపదగినది. యాత్రికులు తొలుత శ్రీపద్మావతీ అమ్మవారిని సేవించి ఆపై తిరుమలకు వెళ్ళి స్వామిని సేవించడం సంప్రదాయం.

"తిరుమల శ్రీనివాసునిపై ప్రముఖ గ్రంథములు"

భగవద్రామానుజులు తిరుమల శ్రీనివాసుని యెదుటనే వేదార్దసంగ్రహమును ఉపన్యసించినారు.

అఖిల భువన జన్మ స్థేమ భంగాది లీలే
విసత వివిధభూత వ్రాత రక్షైక దీక్షే
శ్రుతి శిరసి విదిప్తే బ్రహ్మణి శ్రీనివాసే
భవతు మమ నరస్మిన్ శేముషీ భక్తిరూపా||

అని ఈస్వామి ప్రార్థనతో శ్రీభాష్య రచనకు ఇచటనే శ్రీకారం చుట్టారు. కావుననే శ్రీభాష్యకారుల ఆలయం ఈఆలయప్రాకారంలో ఉన్నతంగా దర్శనమిచ్చు చున్నది. మరియు ఇచట వారు జ్ఞానముద్రతో వేంచేసియున్నారు. వీరు శ్రీవేంకటాచలాదీశ శంఖచక్ర ప్రదాయకులు గదా!

ఈస్వామిని స్తుతించు స్తోత్రాలలో శ్రీవేంకటేశ ఘంటావతారంగా ప్రసిద్దులైన శ్రీవేదాన్త దేశికులవారి "దయాశతకమ్" అగ్రగణ్యమైనది.తొలుత శ్రీవేదాన్త దేశికుల వారికిని, తర్వాత మణవాళ మహామునులకును కరుణైక పాత్రమ్‌" అని కీర్తింపబడుచు శ్రీమన్మణవాళ మహామునుల అష్టదిగ్గజములలో నొకరైన "శ్రీప్రతివాది భయంకరం అణ్ణన్" అను ఆచార్య తల్లజులు ఈస్వామిని గూర్చి సుప్రభాత, స్తోత్ర, ప్రపత్తి; మంగళాశాసన శ్లోకాలను అనుగ్రహించినారు. ఇవినేడును అనుదినం ఉష:కాల సేవలో స్వామియొద్ద అనుసంధింపబడును బహుళప్రచారం పొందియున్నవి.

శ్రీగోవిందరాజాచార్యులు అనే మహనీయులు, శ్రీమద్రామాయణమునకు "గోవిందరాజీయమ్" అనే వ్యాఖ్యను ఇచటనే వ్రాసినారు. శ్రీమత్పరమ హంసేత్యాది శ్రీశ్రీశ్రీ పరకాల మఠం జీయర్‌స్వామివారు(మైసూర్)"అలంకారమణిహారం" అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని అనుగ్రహించారు. అందు ఉదాహరణ శ్లోకాలను శ్రీశ్రీనివాసుని స్తుతించునట్లు వ్రాసియున్నారు. పదకవితా పితామహుడైన శ్రీతాళ్లపాక అన్నమాచార్యులవారు తమగేయాలలో శ్రీవేంకటాచలపతిని మైమరచి తనివి తీర కీర్తించారు. తామ్రపత్రములపై లిఖింపబడిన ఆగీతాలను తి.తి.దేవస్థానం వారు స్వర పరచి చక్కగా ముద్రించి ప్రజలకు అందించారు. ఇట్లే అన్నమాచార్యుల వారి కుటుంబ సభ్యులును వేంకటా చలపతిని వేనోళ్ళ కీర్తించినారు. పురందరదాసు, త్యాగరాజు మున్నగు గాయక సార్వభౌములెందరో తమ తమ మాతృభాషలలో స్వామిని కీర్తించి తరించినారు.

                                         126