ఈ పుట ఆమోదించబడ్డది

ఈ బావిని త్రవ్వించినవాడు రంగదాసు అను గొప్ప భక్తుడు. అతడు స్వామివారికి ఆలయ ప్రాకార గోపురాదులను నిర్మింప సంకల్పించి ప్రాకార నిర్మాణమునకు అడ్డుగా ఉన్న తింత్రిణీ వృక్షమును;(ఈ నిర్ణిద్ర తింత్రిణీ వృక్షము క్రిందినే స్వామి వేంచేసియుండేవారు) స్వామి దక్షిణ పార్శ్వమున అమ్మవారు వేంచేసియున్న చంపక వృక్షమును అడ్డుతొలగవలసినదని సవినయంగా భక్తితో ప్రార్థించారట. ఆరాత్రి ఆరెండు వృక్షములు వెనుకకు తగ్గగా కట్టడములను నిర్మింపజేశారట. నేడు ఈవృక్షములు గలప్రాకారాన్ని చంపక ప్రాకారమని ఆబావిని పూలబావియని వ్యవహరిస్తున్నారు. రామానుజులవారు ఈ వృత్తాన్తాన్ని విని ఆరెండు వృక్షములు ఆదిశేషాంశములని భావించి వానికిని నిత్య తిరువారాధన జరిగేలా నియమించినారట.

మరియొకప్పుడు "వీరనరసింహదేవరాయలు" అను రాజు తిరుమలైకు యాత్రగా వచ్చి స్వామిని సేవించి స్వామికి గోపురము నిర్మించాలని సంకల్పించి పెద్దల అనుమతితో గోపురం కట్టనారంభించినారట. ఒకరోజు రాత్రి ఒక సర్పం ఆరాజు కలలో కనిపించి "రాజా! నీవు ఈగోపురము నిర్మిస్తుంటే నాశరీరం నానా బాధలు పడుతున్నది" అని పలికిందట. రాజు ఆశ్చర్యపడి మరునాడు స్వామిని సేవింపగా ఆ సర్పం స్వామియొక్క వైకుంఠ హస్తమును చుట్టుకొని దర్శనమిచ్చి అంతర్ధానమైనదట. ఆ సన్నివేశం చూచిన రాజు ఆ పర్వతం ఆదిశేషుడే యని విశ్వసించి గోపుర నిర్మాణమును అంతటితో ఆపివేసినాడు. ఆ వృత్తాన్తమును విన్నపెద్దలు స్మారకంగా స్వామివారికి స్వర్ణనాగాభరణమును సమర్పించినారట. రామానుజులవారు దానిని విని రెండవ శ్రీహస్తమునకును నాగాభరణం సమర్పింపజేసినారట.

స్వామి పుష్కరిణీ తీరంలో శ్రీశంకరాచార్యులవారికి శ్రీనరసింహస్వామి సాక్షాత్కరించి నందువలన అచట శ్రీనరసింహస్వామి సన్నిధియుండెడిది. కానీ లక్ష్మీసాహచర్యం లేనందువలన ఆస్వామి మహోగ్రంగా సేవ సాయించేవారట. అందుచే వారిని ఆరాధింపరాదని కొందరు పలుకగా రామానుజులవారు అదిసరికాదని భావించి ఆస్వామిని శ్రీవేజ్కటాచలపతి సన్నిధి ప్రాకారములోనే ఈశాన్య దిక్కున విమానాభిముఖముగా ప్రతిష్ఠింపజేసి వారికి నిత్య తిరువారాధన జరిగేలా ఆదేశించినారట. ఇట్లే పురాణ ప్రసిద్ధి ననుసరించి కొండనెక్కే మార్గంలోను నరసింహమూర్తిని ప్రతిష్ఠింపజేసి వారికి నిత్య తిరువారాదన జరిగేలా ఆదేశించారట.

శత్రువుల వలన కలిగిన ఒక మహోపద్రవ సమయంలో తిల్లై తిరుచ్చిత్తర కూడమున (చిదంబరం) వేంచేసియున్న గోవిందరాజస్వామి ఉభయదేవేరులతో

                                                           122